పెనమలూరు: కానూరు కొత్త ఆటోనగర్‌లో శ్రీ విజయదుర్గ ఫుడ్స్(ఐస్‌క్రీమ్) ఫ్యాక్టరీ ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. రాత్రి సమయంలో ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించి మిషన్‌లు, ఫర్నిచర్, సరుకు అగ్నికి కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటోనగర్‌లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేసుకుని సీటు రాని విద్యార్థులు, మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరు కాని వారికి ఈ నెల 15వ తేదీ బుధవారం జనరల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాగా మిగిలిన సీట్లను ఈ జనరల్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని తెలియజేశారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ అన్ని ఒరిజినల్స్‌తో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలియజేశారు. వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.
విజయవాడలీగల్: పోక్సో కేసులో బాధితురాలి వివరాలను బహిర్గతం చేశారనే ఆరోపణలపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో గోరంట్ల మాధవ్ హాజరుకాలేకపోవడంతో సోమవారం ఆయన తరఫు న్యాయవాది, వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ ఉపాధ్యక్షుడు ఒగ్గు గవాస్కర్ హాజరై, గైర్హాజరు పిటీషన్ దాఖలు చేశారు. దీంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.జయలక్ష్మి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేశారు.


