న్యూస్‌రీల్
అధికారులతో కలెక్టర్ కాన్ఫరెన్స్..
దుర్గమ్మకు పలువురి విరాళాలు
● ఫారాలు సమర్పిస్తేనే ఓటుకు భద్రత
● ఓటర్ల వద్ద నుంచి తిరిగిరాని
69,859 ఎన్యూమరేషన్ ఫారాలు
● త్వరపడాలని సూచిస్తున్న
ఉన్నతాధికారులు
సాక్షి, విజయవాడ/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, అనర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఓటర్లకు ఫారాల పంపిణీ, తిరిగి వాటిని సేకరించడం, డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ పూర్తి కావొస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం సర్ ప్రక్రియలో పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్‌లో పాల్గొనని ఓటర్లు తక్షణమే తమ ఫారాలను బీఎల్వోలకు అందజేస్తేనే ఓటు హక్కు ఉంటుంది. ప్రక్రియ చివరి దశలో అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఫారాలను అందజేసి డిజిటలైజ్ చేయించుకోవాలి.
ఇదీ పరిస్థితి..
గత నెల 15వ తేదీ నుంచి ‘సర్’ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,792 పోలింగ్ బూత్‌లలో 99.9శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు అందజేశారు. వీటిలో 15,52,003 పారాలు డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా ఓటర్ల వద్ద నుంచి 69,859 ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం ఓటర్లలో 37,456 మంది ఓటర్లు మృతి చెందినట్లు ఇంటింటి సర్వేలో అధికారులు గుర్తించారు. 1004 మంది ఓటర్లు ఇప్పటి వరకు ట్రేస్ కాలేదు. 15,281 మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్లు సర్వేలో తేలింది. జిల్లాలో ఇప్పటికీ 1,42,037 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు.
14వ తేదీతో ముగియనున్న గడువు..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఈనెల 14వ తేదీతో ముగియనుంది. కేవలం రెండంటే రెండే రోజులు మిగిలి ఉంది. ఈ లోగా ఫారాలు బీఎల్వోలకు సమర్పిస్తేనే ఓటుకు భద్రత ఉంటుంది. ప్రక్రియ ముగిసిన అనంతరం ఈనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఫారాలు అందజేయని వారి ఓట్లు ఆ జాబితాలో వచ్చే అవకాశం లేదు. ఇప్పటికీ ఫారాలు సమర్పించని ఓటర్లు తక్షణమే ఫారాలు అందజేయాలని కలెక్టర్ కోరారు.
గేటెడ్ కమ్యూనిటీ, విల్లాల వద్ద ఇబ్బందులు..
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే విజయవాడ కార్పొరేషన్ పరిధిలోనే ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ వెనుకంజలో ఉంది. అత్యధికంగా తిరువూరులో 93.93 శాతం, అత్యల్పంగా విజయవాడ సెంట్రల్‌లో 87.12 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. గేటెడ్ కమ్యూనిటీలు, హైసెక్యూరిటీ కలిగిన విల్లాలు, అపార్టుమెంట్లలో నివాసం ఉన్నవారి దగ్గరకు వెళ్లడానికి బీఎల్‌ఓలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. విజయవాడలో ఇప్పటికీ 31,654 మందికి ఇంకా ఫారాలు ఇవ్వలేదని సమాచారం. వీరిలో 15,359 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా మిగిలినవారు వలసలు, పెళ్లిళ్లు చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లడం, ఇళ్లు మారడం వంటి కారణాలతో ఆచూకీ దొరకలేదు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చి కొన్నాళ్లు విజయవాడలో ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికీ ఇదే సమస్య ఎదురవుతోంది.
గడువు ముగిసే లోపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఫారాలు సమర్పించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బీఎల్వోలు, ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్కులను సంప్రదించాలని తెలిపారు. ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు, బీఎల్వోలు నిరంతరం అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు సమర్థంగా పనిచేస్తున్నాయని, ఓటర్లు వాటి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగు వారికి కూడా సమాచారం అందించి, గడువు తేదీలోగా ఫారాలు సమర్పించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఈ మేరకు స్పష్టం చేశారు. మిగిలిన రెండు రోజులు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అత్యంత కీలకమైనవని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్కులు సమర్థంగా పనిచేసేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.


