ఆషాఢ మాసోత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి | - | Sakshi
Sakshi News home page

ఆషాఢ మాసోత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

ఆషాఢ మాసోత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలలో దసరా ఉత్సవాలు మొదటి స్థానంలో ఉండగా, రెండోది భవానీ దీక్ష విరమణలు.. ఇప్పుడు ఆషాఢ మాసోత్సవాలకు దసరా, భవానీ దీక్షలంత ప్రాధాన్యం సంతరించుకుంది. దసరా ఉత్సవాలు పది రోజులు, భవానీ దీక్ష విరమణలు 5 రోజులు జరిగితే.. ఆషాఢ మాసోత్సవాలు నెల రోజులు జరుగుతాయి. ఇక ఇదే మాసంలో తెలంగాణ నుంచి దుర్గమ్మకు బంగారు బోనం, శాకంబరీ ఉత్సవాలు జరగడం విశేషం.

నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు..

నెల రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పిస్తారు. అంతే కాకుండా ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో ఆషాఢ మాసం ఒక పెద్ద పండుగను సంతరించుకుంది. వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థలు, భక్త సమాజాలతో పాటు అపార్టుమెంట్‌ వాసులు, కాలనీ వాసులు, కుటుంబాలు బృందాలు ఏర్పడి ఇంద్రకీలాద్రికి మేళతాళాలతో తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించడం గత కొన్నేళ్లగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆషాఢ మాసం తొలి రోజు నుంచి 9 రోజుల పాటు వారాహి నవరాత్రులను ఆలయ అర్చకులు అమ్మవారి ప్రధానాలయంలో మూలవిరాట్‌ వద్ద నిర్వహిస్తారు. 24వ తేదీ వారాహి నవరాత్రుల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహిస్తారు.

ఆలయ అర్చకుల తొలి సారె..

ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమయ్యే 15వ తేదీన ఆలయ అర్చకులు, వేద పండితులు తొలి సారెను అమ్మవారికి సమర్పిస్తారు. 25వ తేదీన దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు తరఫున చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఆగస్టు 12వ తేదీన ఆలయ ఈవో శీనానాయక్‌, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఇతర అధికారులు, సిబ్బంది సారెను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ నుంచి బంగారు బోనం..

ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తెలంగాణ నుంచి ఏటా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. 26వ తేదీ ఆదివారం సుమారు రెండు వేల మంది తెలంగాణ భక్తులు తీన్‌మార్‌ డప్పులు, కోలాట నృత్యాలు, బేతాళ నృత్యాలతో ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి బంగారు బోనం, సారె, పసుపు, కుంకుమ, తెలంగాణ ఆచారం ప్రకారం ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు.

ప్రకృతి మాతగా..

జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉపాలయాల్లో దేవతామూర్తులు, ఆలయ ప్రాంగణాన్ని కాయగూరలు, ఆకుకూరలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన ఆకుకూరలు, కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తారు.

15నుంచి వారాహి నవరాత్రులు

26న దుర్గమ్మకు తెలంగాణ బోనం

27 నుంచి నుంచి శాకంబరీదేవి

ఉత్సవాలు

దసరా ఉత్సవాల తరహాలో

ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం

ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులతో పాటు సారె సమర్పించే భక్త బృందాలను సైతం ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి చేరుకోవాలని సూచిస్తున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని దర్శించుకొని సారె సమర్పిస్తారు. అక్కడే భక్తులు తమతో తెచ్చుకున్న పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిఠాయిలను పంచుకుని, నేరుగా మహామండపం దిగువకు చేరుకుంటారు. అక్కడ మొదటి, రెండో అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను తీసుకుని కనకదుర్గనగర్‌కు చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో కనకదుర్గనగర్‌లో నెల రోజుల పాటు క్లోక్‌రూమ్‌, చెప్పుల స్టాండ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దుర్గాఘాట్‌ ఎదుట చైనావాల్‌ నుంచి కొండపైకి ఉచితంగా దేవస్థానం బస్సులను నడపాలని నిర్ణయించింది. వృద్ధులు, వికలాంగులతో పాటు చంటి బిడ్డల తల్లులు ఈ బస్సు సేవలను వినియోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement