గ్రహణమొర్రికి ఆధునిక చికిత్సపై సదస్సు | - | Sakshi
Sakshi News home page

గ్రహణమొర్రికి ఆధునిక చికిత్సపై సదస్సు

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

గ్రహణమొర్రికి ఆధునిక చికిత్సపై సదస్సు హామీలను తక్షణం నెరవేర్చాలి సృజనకారుల స్వరం బలంగా వినిపించాలి ఐఏపీ ప్రెసిడెంట్‌–ఎలక్ట్‌గా డాక్టర్‌ ఉమాజ్యోతి

లబ్బీపేట(విజయవాడతూర్పు)/గన్నవరం రూరల్‌: డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో డాక్టర్‌ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో ఆదివారం గ్రహణం మొర్రి, అంగిలి చీలికకు ఆధునిక సర్జరీలపై సదస్సు జరిగింది. ఆ కళాశాల ఓరల్‌ అండ్‌ మాక్సిల్లో ఫేషియల్‌ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో నాలుగు దంత వైద్య కళాశాలలకు చెందిన ఓరల్‌, మాక్సిల్లో ఫేషియల్‌ సర్జరీ(ఓఎంఎఫ్‌ఎస్‌) విభాగ వైద్యులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సును తొలుత ఆ కళాశాల ఓఎంఎఫ్‌ఎస్‌ విభాగాధిపతి డాక్టర్‌ నాదెళ్ల కోటేశ్వరరావు, డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ ఇతర అధ్యాపకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సదస్సులో ముఖ్యవక్తలుగా డాక్టర్‌ ఆనంద్‌ విజయ్‌, డాక్టర్‌ చంద్రబాబు, డాక్టర్‌ శ్రీకాంత్‌ గ్రహణమొర్రి, అంగిలి చీలికలకు శస్త్ర చికిత్స మెలకువలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మూల్పూరి రామోజీరావు, కార్యనిర్వాహణాధికారి వై. మధుసూదనరావు, కరస్పాండెంట్‌ పాలడుగు సాయి పాల్గొన్నారు.

గన్నవరం: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం వెంట నే నెరవేర్చాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ ఎల్‌. సాయిశ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం రాష్ట్రోపధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా హామీలు అమలులో తీవ్ర తాత్సారం చేయడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి తీవ్రంగా ఉందన్నారు. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, పికెటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐఎస్‌టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి జోసఫ్‌ సుధీర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు పి. ఇమ్మానియేలు, ప్రధాన కార్యదర్శి యూవీ కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. చంద్రశేఖర్‌, డి. విద్యాసాగర్‌, సీపీఐ నేతలు అడ్డాడ ప్రసాద్‌, నార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

విజయవాడ కల్చరల్‌: సృజనకారుల స్వరం బలంగా వినిపించాలని ప్రముఖ సాహితీవేత్త గంటేడ గౌరినాయుడు అన్నారు. సాహితీ స్రవంతి, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సాహితీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. సృజనకారుల స్వరం కార్యక్రమంలో భాగంగా ‘మేం ఎందుకు రాస్తున్నాం’ అంశంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు కళాకారులు పాల్గొన్నారు. గౌరి నాయుడు మాట్లాడుతూ కవులు, రచయితలు భావవ్యక్తీకరణకు ప్రాధాన్యం నివ్వాలని సూచించారు. కవులు, రచయితలు వేంపల్లి షరీఫ్‌, పాయల మురళీ కృష్ణ,కట్టా సిద్ధార్థ, మెర్సీ మార్గరెట్‌, వడ్లమూడి పద్మ, వావిళ్లపల్లి సృజన, పట్టుపల్లి నాగరాజు తమ భావాలను వివరించారు. సాహితీవేత్తలు శాంతిశ్రీ, ఉషారాణి సమన్వయ పరిచారు. తెలుగు కథ సామాజిక చింతన అంశంగా జంధ్యాల రఘుబాబు, కథా రచన మెళకువలు అంశంగా అట్టాడ అప్పలనాయుడు కవులకు దిశానిర్దేశం చేశారు.

గుంటూరు మెడికల్‌: ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ(ఐఏపీ) ఏపీ స్టేట్‌ బ్రాంచ్‌ ప్రెసిడెంట్‌ –ఎలక్ట్‌గా గుంటూరు జీజీహెచ్‌ మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి డాక్టర్‌ నీలి ఉమా జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విశాఖపట్నంలో మానసికవ్యాధి వైద్య నిపుణుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్‌ ఉమాజ్యోతిని మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర శాఖకు ప్రెసిడెంట్‌–ఎలక్ట్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈమె రాష్ట్ర శాఖలో వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement