తిరువూరు: పట్టణంలో జరుగుతున్న పలు నిర్మాణ పనులకు.. నిబంధనలకు విరుద్ధంగా మునిసిపల్ ట్రాక్టర్లు, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడానికి గతంలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఎంపీ ల్యాడ్స్ నుంచి మంజూరు చేసిన నిధులతో కొనుగోలు చేసిన ట్యాంకర్లు, ట్రాక్టర్లను నిర్మాణ పనులకు కేటాయిస్తూ వార్డుల్లో ప్రజల గోడును అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఆర్థిక సంఘ నిధులు, సాధారణ నిధులతో కాంట్రాక్టర్లు చేయాల్సిన డ్రెయినేజీలు, సీసీ రహదారుల నిర్మాణ పనులకు ఈ ట్యాంకర్లతో నీరందించడం, రక్షిత మంచినీటి సరఫరా జరగని వార్డుల్లో ట్యాంకర్లను పంపకపోవడంపై పలువురు పట్టణ ప్రజలు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.
మునిసిపల్ విధులకు డుమ్మా..
తిరువూరు మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికపై నియమితులైన వ్యక్తి భార్య పేరుతో కాంట్రాక్టులు చేస్తూ ఆఫీసు విధులకు డుమ్మా కొడుతున్నట్లు కూడా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఇంజినీరింగ్ అధికారులు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి వత్తాసు పలుకుతూ విధులకు రాకపోయినా జీతాలు చెల్లిస్తుండటంతో ఇతర ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై మునిసిపల్ కమిషనర్ మనోజను వివరణ కోరగా.. మునిసిపల్ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి భార్య పేరుతో కాంట్రాక్టు చేయడం తప్పేమీ కాదని, విధులకు వస్తున్నారో లేదో పరిశీలిస్తానని చెప్పారు. మునిసిపల్ ట్యాంకర్లకు చలానా కడితే ఎవరికై నా నీరు సరఫరా చేస్తామన్నారు. కాంట్రాక్టరు చలానా కట్టిందీ లేనిదీ తెలియదన్నారు.


