రాగి తీగలు చోరీ చేసే అంతర్‌ రాష్ట్ర ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రాగి తీగలు చోరీ చేసే అంతర్‌ రాష్ట్ర ముఠా అరెస్టు

Mar 27 2025 1:43 AM | Updated on Mar 27 2025 1:43 AM

రాగి తీగలు చోరీ చేసే అంతర్‌ రాష్ట్ర ముఠా అరెస్టు

రాగి తీగలు చోరీ చేసే అంతర్‌ రాష్ట్ర ముఠా అరెస్టు

కంకిపాడు: సులభ సంపాదన మోజులో రాగితీగల చోరీలకు పాల్పడ్డ అంతర్‌ రాష్ట్ర ముఠాకు కంకిపాడు పోలీసులు చెక్‌ పెట్టారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 22 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4.50 లక్షల విలువైన 300 కిలోల రాగి తీగ స్వాధీనం చేసుకున్నారు. కంకిపాడు పోలీసుస్టేషన్‌లో బుధవారం గన్నవరం డీఎస్పీ సీహెచ్‌ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి చెందిన పంబి శ్రీను తాపీ కార్మికుడు. జల్సాల కోసం చోరీలను మార్గంగా ఎంచుకున్నాడు. ఇతనిపై గతంలోనే 12 వైరు చోరీ కేసులు, రెండు స్నాచింగ్‌ కేసులు ఉన్నాయి. పరిచయస్తులైన ఇబ్రహీం పట్నం ఫెర్రీకి చెందిన ముత్యాల గోపాలకృష్ణ, జి.కొండూరు గ్రామానికి చెందిన వెన్నముద్దల దుర్గాప్రసాద్‌రెడ్డిలను కలుపుకొని వ్యవసాయ మోటర్ల దగ్గర ఉండే కరెంటు వైర్లు, ట్రాన్స్‌ ఫార్మర్లకు ఉండే వైర్లు కత్తిరించి అందులోని రాగివైరు చోరీ చేయటం మొదలుపెట్టారు. పొలాల్లో వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి వైర్లు కత్తిరించి అక్కడే వైర్లు కాల్చి అందులో ఉన్న రాగివైరు చోరీ చేసి అమ్ముకుంటుంటారు.

రెక్కీలో పట్టుబడ్డ నిందితులు

కంకిపాడు మండలం ప్రొద్దుటూరు పరిధిలోని కొణతనపాడు అడ్డరోడ్డు వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రెండు మోటర్‌ బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తించటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితులైన పంబి శ్రీను, ముత్యాల గోపాలకృష్ణ, వెన్నముద్దల దుర్గా ప్రసాద్‌రెడ్డిగా గుర్తించారు. వీరిపై ఇప్పటివరకూ కంకిపాడు–4, ఉంగు టూరు–1, తోట్లవల్లూరు–4, ఆత్కూరు–2, వీరవల్లి–7, హనుమాన్‌ జంక్షన్‌–3, ఎ.కొండూరు–1 చొప్పున 22 కేసులు ఉన్నాయి. వీరు 216 వ్యవసాయ మోటర్లు, 7 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగివైరు చోరీ చేసినట్లు నిర్థారించారు. వారి నుంచి రూ.4.50 లక్షల విలువైన 300 కిలోల బరువు, 2400 మీటర్ల పొడవు గల రాగివైరు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ చూపిన సీఐ జె. మురళీకృష్ణ, ఎస్‌ఐ డి.సందీప్‌, హెచ్‌సీ కె.చంద్రబాబు, పీసీలు పీఎస్‌ఎన్‌ మూర్తి, అశోక్‌, బాజీబాబు, హెచ్‌జీలు మురార్జీ, పిళ్లైలకు రివార్డులు అందించారు. సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ డి.సందీప్‌, ఉయ్యూరురూరల్‌ ఎస్‌ఐ సురేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement