రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, గురునానక్ కాలనీలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో జరుగుతున్న 87వ జాతీయ స్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ –2025 పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గురువారం ప్రీ క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడాకారులతో పాటుగా ఆర్బీఐ, కాగ్, ఎల్‌ఐసీ, రైల్వేస్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థల నుంచి కూడా క్రీడాకారులు తలపడుతున్నారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన సూర్య చరిష్మ జమ్ము అండ్ కశ్మీర్‌కు చెందిన కృష్ణ మహాజన్‌పై 21–8, 21–10 స్కోర్ తేడాతో విజయం సాధించింది. తెలంగాణకు చెందిన మేఘనారెడ్డి చండీగఢ్ చెందిన రాజిల్‌పై 21–16, 19–21, 21–9 స్కోర్‌తో గెలిచింది. తెలంగాణకు చెందిన రక్షితాశ్రీ కోల్‌కత్తాకు చెందిన రాజుల రాముపై 21–15, 21–16 స్కోర్‌తో గెలుపొందింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటహర్షవర్థన్, కవి ప్రియ జంట ఒడిశాకు చెందిన ఆయుష్, ప్రభుప్రత్యూషపై 21–14, 21–10 స్కోరు తేడాతో విజయం సాధించింది. ఉమెన్స్ డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపిక, స్రవంతి 21–12, 21–8 స్కోర్‌తో విజయం సాధించారు.
రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు


