మధుమేహం బారిన యువతరం
బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లకు మధుమేహం కారణమే గుండె, మెదడు రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం జీవనశైలిలో మార్పులు అవసరం అంటున్న వైద్య నిపుణులు
చిన్న వయస్సులోనే బ్రెయిన్ స్ట్రోక్
లబ్బీపేట(విజయవాడతూర్పు)ః కదలికలేని జీవన విధానం, వినూత్న ఆహారపు అలవాట్లు బాల్యాన్ని వ్యాధుల బారిన పడేస్తున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. జీవనశైలి వ్యాధులను నిర్లక్ష్యం చేయడంతో మూడు పదుల వయసు నిండక మునుపే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్‌లకు గురవుతున్నారు. ఒకప్పుడు మధుమేహం సోకిన ఐదు నుంచి పదేళ్లలో స్ట్రోక్‌కు గురయ్యేవారు. ఇప్పుడు ప్రీ డయాబెటీస్‌లో కూడా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. విజయవాడ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పక్షవాతం, గుండెపోటులకు గురైన వారు నిత్యం వంద మంది వరకూ వస్తుంటారు. వారిలో 20 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు 15 నుంచి 20 శాతం ఉంటున్నారు. యువతలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు అదుపులో లేని మధుమేహమే కారణమనేది వైద్య నిపుణుల మాట. తీవ్రమైన వత్తిళ్లు, అదుపులోలేని మధుమేహం, ఆధునిక జీవనశైలి కూడా దీనికి దారి తీస్తున్నట్లు చెపుతున్నారు.
ఇవే నిదర్శనం...
విజయవాడ కృష్ణలంకకు చెందిన 22 ఏళ్ల రాజేష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటారు. అతనికి రెండేళ్ల కిందట మధుమేహం ఉన్నట్లు గుర్తించాడు. తనకు ఎలాంటి దుష్పలితాలు లేవంటూ సక్రమంగా మందులు వాడలేదు. దీంతో ఇటీవల హఠాత్తుగా పక్షవాతానికి గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
● భవానీపురానికికు చెందిన 30 ఏళ్ల విక్రమ్ వ్యాపారంలో తీవ్రమైన వత్తిడిని ఎదుర్కొంటాడు. రెండున్నరేళ్ల కిందట డయాబెటిస్ సోకింది. సక్రమంగా మందులు వాడక పోవడంతో అదుపులో ఉండేది కాదు. ఇలీవల ఆయాసం రావడంతో పరీక్షలు చేయించుకోగా, గుండెపోటుకు గురైనట్లు తెలిపారు. ఇలా వీరిద్దరే కాదు అనేక మంది ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే పక్షవాతం, గుండెపోటుకు గురవుతున్నారు.
ఇవే కారణం...
● మధుమేహుల్లో గుండె, మొదడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలు ఏర్పడతాయి. దీంతో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి స్ట్రోక్‌కు గురవుతుంటారు.
● మధుమేహం అదుపులో లేని వారిలో రక్తం గడ్డ కట్టే గుణం ఉంటుంది. అలాంటి గడ్డలు రక్త ప్రసరణకు అడ్డొచ్చి స్ట్రోక్‌కు గురవుతుంటారు.
● మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తనాళాలు సన్నపడటం, బిగుతుగా మారడం జరుగుతుంది. దీంతో రక్తప్రసరణ సరిగ్గా జరగక స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు.
ఇటీవల 30, 40 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిని చూస్తున్నాం. వారిలో మధుమేహులు కూడా ఉంటున్నారు. అదుపులో లేని మధుమేహం బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తుంది. రక్త నాళాలు కుచించుకుపోవడం, కొలెస్ట్రాల్, రక్తం గడ్డలు మొదడు రక్త ప్రసరణపై ప్రభావం చూపుతాయి. ఆల్కహాల్, ధూమపానం చేసే వారిలో కూడా చిన్న వయస్సులో స్క్రోక్ వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనప్పుడు గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేరితే 80 శాతం మందిలో వైకల్యం లేకుండా చూడొచ్చు.
డాక్టర్ చేకూరి మురళి, న్యూరాలజిస్ట్
మధుమేహం బారిన యువతరం


