శరణు.. శరణు.. దుర్గమ్మ
అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు తెల్లవారుజాము నుంచే రద్దీ ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చనలో రికార్డు స్థాయిలో 33 టికెట్లను విక్రయించారు. ఉదయం ఆరు గంటల తర్వాతే అంతరాలయ దర్శనం కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే ఆల యానికి చేరుకున్న భక్తులు అంతరాలయ దర్శనం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, చండీహోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో కొండపైకి కేవలం ద్విచక్ర వాహనాలు, దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతించారు. తెలంగాణ వైపు నుంచి వచ్చిన భక్తుల వాహనాలతో హెడ్ వాటర్ వర్క్సు, కుమ్మరి పాలెం, పున్నమి ఘాట్‌లు నిండిపోయాయి. మధ్యాహ్నానికి ఘాట్ రోడ్డులోని ఓం టర్నింగ్, మహా మండపంలోని ఐదో అంతస్తు వరకు క్యూ చేరింది. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రద్దీ కొనసాగగా, సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తుల తాకిడి కనిపించింది.
విధుల్లో కనిపించని ఆలయ సిబ్బంది
రద్దీ సమయాల్లో దేవస్థానానికి చెందిన అన్ని విభాగాల సిబ్బందికి ఈఓ ప్రత్యేక విధులు కేటాయిస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. గురువారం స్కానింగ్ పాయింట్ వద్ద రద్దీని నియంత్రించేందుకు ఇద్దరు ఏఈఓలు, సూపరింటెండెంట్ విధులు నిర్వహిస్తుండగా, ప్రత్యేక విధులు కేటాయించిన సిబ్బంది మచ్చుకై నా కనిపించలేదు. దీంతో స్కానింగ్ పాయింట్‌లో టికెట్ల కౌంటర్‌తో పాటు స్కానింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు టికెట్లను సకాలంలో ఇవ్వలేదు.
అమలు కాని వీఐపీ ప్రొటోకాల్ సమయం
పండుగలు, పర్వదినాలు, విశేషమైన రోజుల్లో వీఐపీలకు దేవస్థానం ప్రత్యేక సమయాలను కేటాయించినా అవి అమలుకావడం లేదు. రద్దీ వేళల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. దసరా ఉత్సవాల ముందు వరకు ఈ నిబంధనను దేవస్థానం అమలు చేసింది. ఆ సమ యంలో ఒక వేళ వీఐపీలు విచ్చేసినా డోనర్ సెల్‌లో వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం రద్దీ అధికంగా ఉన్న సమయంలో వీఐపీల పేరిట పలువురు దర్శనానికి విచ్చేశారు. దీనికి తోడు దేవస్థానం చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యుల బంధువులు, స్నేహితుల పేరిట మరో వైపు దర్శనాలు కొనసాగాయి. దీంతో రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అసలు ట్రస్ట్ బోర్డు వైపు నుంచి ఎంత మంది దర్శనాలకు విచ్చేస్తున్నారనే దానిపై చైర్మన్, సభ్యుల కార్యాలయాల్లో కచ్చితమైన సమాచారం లేకపోవడం గమనార్హం.
శరణు.. శరణు.. దుర్గమ్మ


