కార్మికులను సంఘటిత పోరాటాలకు సిద్ధం చేయాలి
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ సహజ సంపదను, వనరులను అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెట్టి దేశ ప్రజలను నిర్వాసితులను చేస్తున్న అభినవ దానకర్ణులు మోదీ, అమిత్ షా, చంద్రబాబు కూటమి ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా రైతులను, కార్మికులను కూడగట్టి సంఘటిత పోరాటాలకు సిద్ధం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వెలువరించిన ‘శ్రామిక నేస్తం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వ్యయసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణకు పాల్పడుతున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాలు రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులు హరించి వేస్తున్నారని ఆగ్రహం వ్యకం చేశారు. అనంతరం ‘నూతన కార్మికచట్టాలు– భారత కార్మిక వర్గంపై వాటి దుష్ప్రబావం అనే అంశంపై ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ హక్కులు కోల్పోతున్న అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయాలన్నారు. కార్మిక, కర్షకుల సమస్యలు వాటి పరిష్కార మార్గాల కోసం శ్రామిక నేస్తం పత్రిక కృషి చేస్తుందన్నారు. శ్రామిక నేస్తం పత్రిక ఎడిటర్ అన్నపూర్ణ అధ్యక్షత వహించిన సభలో ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు బిర్రా రవి, మస్తాన్, కొండారెడ్డి పాల్గొన్నారు.


