రంగుల మహోత్సవం
రజకులు నెత్తిపై పెట్టుకొని మోసుకుంటూ...
పెనుగంచిప్రోలులో ప్రతి రెండేళ్లకు జరిగే పండుగ
● తిరుపతమ్మ వారి సన్నిధిలో
26 రోజుల పాటు సందడి
● పేటలో నకాసి వంశీయుల
చేతిలో రంగులద్దుకునే విగ్రహాలు
● జనవరి 5 నుంచి 30 వరకు
కొనసాగనున్న ఉత్సవం
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి రంగుల మహోత్సవం వచ్చిందంటే పెనుగంచిప్రోలు, మక్కపేట, చిల్లకల్లు, జగ్గయ్యపేట, భీమవరం, లింగగూడెం గ్రామ ప్రజలకు, వారి బంధువులకు ఇంతకన్నా పెద్ద పండుగ ఉండదు. పురాతన కాలంలో చెక్కతో చేసిన విగ్రహాలు కావటంతో విగ్రహాలకు చిన్నచిన్న మరమ్మతులు అవసరమవుతాయి. దీంతో ప్రతి రెండేళ్లకు 11 విగ్రహాలకు జగ్గయ్య పేటలో రంగులు వేసే పనులు పూర్వ కాలం నుంచి నిర్వహిస్తున్న నకాసి వంశీయులు చేస్తున్నారు. జనవరి 5న రంగులకు బయలుదేరే విగ్రహాలు జనవరి 6 మధ్యాహ్నానికి జగ్గయ్యపేట రంగుల మండపానికి చేరుతాయి. రంగుల అనంతరం విగ్రహాలు జనవరి 28వ తేదీ తెల్లవారు జామున జగ్గయ్యపేటలో బయలు దేరతాయి. జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు, రాత్రికి వత్సవాయి మండలం భీమవరానికి విగ్రహాలు చేరుతాయి. అనంతరం జనవరి 29న భీమవరం నుంచి పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామానికి మధ్యాహ్నానికి చేరుకుంటాయి. రాత్రి గం.9.30 గంటలకు పెనుగంచిప్రోలు రంగుల మండపానికి చేరుకుంటాయి. రాత్రి 11 గంటల నుంచి గ్రామంలో అందంగా అలంకరించిన రథంపై విగ్రహాలను ఉంచి ఊరేగిస్తారు. జనవరి 30 తెల్లవారు జాముకు విగ్రహాలు ఆలయానికి చేరుకుని గద్దె నెక్కుతాయి. ఉత్సవాల విశేషాలు ఇలా ఉంటాయి.
తిరుగు ప్రయాణంలో...
శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారుతో పాటు సహదేవతల విగ్రహాలను తిరుగు ప్రయాణంలో రజకులు జగ్గయ్యపేట నుంచి పల్లకీల్లో చిల్లకల్లు, భీమవరం, లింగగూడెం మీదుగా పెనుగంచిప్రోలుకు చేరుస్తారు. పల్లకీలు పెనుగంచిప్రోలు–5, అనిగండ్లపాడు, సుబ్బాయిగూడెం, ముండ్లపాడు గ్రామాలకు చెందిన ఒక్కో పల్లకీ ఉంటుంది. గ్రామాల్లో పల్లకీలకు భక్తులు ఎదురేగి స్వాగతం పలుకుతారు. మొక్కులు తీర్చుకొని కుటుంబసభ్యులు, బంధుగణంతో సరదాగా గడుపుతారు.
ఆలయం నుంచి విగ్రహాలను బయటకు తీసిన తరువాత రజకులు వాటిని నెత్తిన పెట్టుకొని మోసుకుంటూ పెనుగంచిప్రోలు గ్రామం చివరన ఉన్న రంగుల మండపం వరకు చేరుస్తారు. అక్కడ నుంచి విగ్రహాలను గ్రామానికి చెందిన రైతులు అందంగా అలంకరించిన ఎడ్లబండ్లపై ఒక్కొక్క బండిలో ఒక్కో విగ్రహాన్ని ఉంచి 11 విగ్రహాలను 11 ఎడ్లబండ్లపై ఉంచి జగ్గయ్యపేటలో రంగులు వేసే మండపం వద్దకు మక్కపేట, చిల్లకల్లు మీదుగా భక్తజన సందోహం మధ్య తీసుకెళ్తారు.


