NRI: పల్లె నుంచి ప్రపంచస్థాయికి.. కరీంనగర్‌ వాసి! | Sakshi
Sakshi News home page

NRI: పల్లె నుంచి ప్రపంచస్థాయికి.. కరీంనగర్‌ వాసి!

Published Tue, Mar 5 2024 9:43 AM

NRI: Narender Is An Official Executive On The Forbes List - Sakshi

ఫోర్బ్స్‌ జాబితాలో అఫీషియల్‌ ఎగ్జిక్యూటీవ్‌గా నరేందర్‌కు స్థానం

తిమ్మాపూర్‌ మండలం మక్తపల్లి వాసి

160 ఇన్నోవేటివ్‌ జర్నల్స్‌ రచనలు

కరీంనగర్‌: తిమ్మాపూర్‌ మండలం మక్తపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ తన టాలెంట్‌తో విశ్వవేదికపై మరోమారు మెరిశాడు. ఫోర్బ్స్‌ జాబితాలో అఫీషియల్‌ ఎగ్జిక్యూటీవ్‌గా స్థానం పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా 160కిపైగా విద్యా విషయక జర్నల్స్‌ రాసినందుకు ఈ గుర్తింపు లభించింది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పిల్లర్‌ ఆఫ్‌ ది నేషన్‌ అవార్డు ప్రకటించింది.

చిన్న గ్రామం నుంచి అగ్రరాజ్యానికి..
మక్తపల్లికి చెందిన చింతం రాములు–కనకలక్ష్మి దంపతుల కుమారుడు చింతం నరేందర్‌. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలో పూర్తిచేశాడు. ఉన్నత విద్య ఎల్‌ఎండీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ కరీంనగర్‌లో చదివాడు. 2007లో హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు.

సాఫ్ట్‌వేర్‌గా కెరీర్‌..
చదువు పూర్తయిన తర్వాత నరేందర్‌ బెంగళూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. తర్వాత వత్తిరీత్యా అమెరికా, ఇటలీ, జర్మనీ, లండన్, స్కాట్‌లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో పర్యటించారు. తక్కువ సమయంలో ఎక్కువ దేశాల్లో పనిచేసి సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్‌గా గుర్తింపు పొందాడు. 2015 నుంచి అమెరికాలో స్థిరపడ్డాడు.

రీసెర్చ్‌ పేటెంట్లు..
అమెరికా వెళ్లిన తర్వాత నరేందర్‌ 55 కీలక అంశాలపై రీసెర్చ్‌ చేసి ఇన్నోవేటివ్‌ పేటెంట్లు పబ్లిష్‌ చేశాడు. తర్వాత ప్రపంచస్థాయి కాన్ఫరెన్సులకు కీనోట్‌ స్పీకర్‌గా వ్యవహరించాడు. 11 ప్రపంచస్థాయి జర్నల్‌ సంస్థలకు చీఫ్‌ ఎడిటర్‌గా పనిచేస్తూ సుమారు 160 ప్రపంచస్థాయి జర్నల్‌ ప్రచురించాడు. అనేక విద్యాసంస్థల టెక్నికల్‌ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నాడు.

నరేందర్‌ను ప్రశంసిస్తూ వచ్చిన లేఖ పత్రం, నరేందర్‌కు వచ్చిన నేషన్‌ అవార్డు

కేంబ్రిడ్జి నుంచి డాక్టరేట్‌..
నరేందర్‌ రీసెర్చ్‌ జర్నల్స్‌ను గుర్తించిన ప్రపంచంలోని అత్యున్నతమైన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇటీవల చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా పట్టా అందజేసింది. అతి తక్కువ సమయంలోనే కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ కంపెనీలో సీనియర్‌ ఎంటర్‌ఫ్రైస్‌ ఆర్కిటెక్ట్‌ స్థానం సంపాదించాడు. అనేక ఇన్నోవేటివ్‌ జర్నల్స్‌ మార్కెట్లో విడుదల చేసి, అత్యంత ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ జర్నల్‌లో అఫీషియల్‌ ఎక్జిక్యూటీవ్‌గా స్థానం సంపాదించాడు.

పిల్లర్‌ ఆఫ్‌ ది నేషన్‌ పురస్కారం!
ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నరేందర్‌కు పిల్లర్‌ ఆఫ్‌ ది నేషన్‌ అవార్డు ప్రదానం చేసింది. ఈమేరకు స్పీకర్‌ శ్రీరాం నివాస్‌గోయల్‌ ఇటీవల అవార్డును ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈమేరకు నరేందర్‌ను ప్రశంసిస్తూ లేఖ కూడా పంపించారు.

గ్రామంలో సంబరాలు..
తమ ఊరి యువకుడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై మక్తపల్లిలో నరేందర్‌ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు సంబురాలు చేసుకున్నారు. నరేందర్‌ తల్లిదండ్రులు అందరికీ మిఠాయిలు పంచారు.
 

Advertisement
Advertisement