వచ్చేవారం రీవైజ్డ్ జీవో
తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో సుదీర్ఘ జాప్యం
పలుమార్లు గేట్లు పడి టెన్షన్ పడుతున్న ఇంటర్ విద్యార్థులు
పరీక్ష కేంద్రానికి చేరేవరకు ఆందోళనే అంటున్న తల్లిదండ్రులు
కలెక్టర్ స్పందించాలని విద్యార్థులు, వాహనదారుల వేడుకోలు
వారంలో భూసేకరణపై కొత్త జీవో వస్తుందంటున్న ఆర్డీవో
పరీక్ష కేంద్రం చేరే వరకు టెన్షనే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణంతో నగరవాసులకు రోజురోజుకు సమస్యలు పెరుగుతున్నాయి. అంబులెన్స్‌లో రోగులతో పాటు, ఇంటర్ వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్ పరీక్షల వేళ కరీంనగర్– చొప్పదండి మార్గంలో తీగలగుట్టపల్లి రైల్వేగేట్ వద్దే విద్యార్థులకు తొలిపరీక్ష ఎదురువుతోంది. గేటు వద్ద ఇరుకై న రోడ్డుతో ట్రాఫిక్ జాం, గేటు పడితే కనీసం అరగంట వృథా అయ్యే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని నిత్యం ఆందోళన చెందుతున్నారు. భూసేకరణ కారణంగా రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం ఏర్పడుతోందని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. భూసేకరణకు ప్రతిబంధకంగా ఉన్న జీవో స్థానంలో మరోటి రానుందని, అది రాగానే భూసేకరణకు విఘ్నాలు తొలగిపోతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఎడతెగని జాప్యం
కరోనాకు ముందు పెద్దపల్లి– కరీంనగర్– జగిత్యా ల రైల్వేమార్గంలో అంతగా రద్దీ ఉండేది కాదు. గతంలో రామగుండం మీదుగా బొగ్గు, ఇతర సరుకులతో నిజామాబాద్ వెళ్లేందుకు గూడ్సు రైళ్లు ఖాజీపేట మీదుగా 300 కిమీ ప్రయాణించాల్సి వచ్చేది. కరోనా సమయంలో జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు మార్గం అందుబాటులోకి వచ్చింది. దాదాపు 150 కిలోమీటర్ల దూరం తగ్గడంతో గూడ్సు రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు ఈ మార్గంలో నడిపిస్తున్నారు. దీంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగి.. తీగలగుట్టపల్లి వద్ద గంటకు ఒకసారి రైలుగేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నగరవాసులతో పాటు చొప్పదండి మార్గంలో ప్రయాణించేవారికి ఇబ్బందిగా మారింది. దీంతో ఆర్వోబీ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో సెంట్రల్ ఇన్‌ఫ్రాక్టర్ రోడ్ ఫండ్ (సీఐఆర్‌ఎఫ్) కింద రూ.154 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో నాలుగు వరుసల్లో 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో వంతెన పనులు రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. 2023 జూలై 13న అప్పటి మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ పనులకు శంకుస్థాపన చేశారు. భూసేకరణ సమస్య కారణంగా ఇక్కడ పనులు మొదలై మూడేళ్లు అవుతున్నా.. ముందుకు సాగడం లేదు. రైలుగేటు పడిన ప్రతీసారీ.. ఇటు అపోలో ఆసుపత్రి వరకు, అటు తీగలగుట్టపల్లి వరకు ట్రాఫిక్ నిలిచిపోతోంది. గతంలో గేటు పడి పలువురు పేషెంట్ల ప్రాణాలు అంబులెన్సులోనే పోయిన సందర్భాలున్నాయి.
రైల్వేగేటు వద్ద అనుకున్న విధంగా డిజైన్ రూపొందించలేదన్న విమర్శలు ఉన్నాయి. రోడ్డులో మధ్యలో కాకుండా ఒకవైపు పక్కకు జరిగి నిర్మాణం సాగుతోంది. దీంతో రోడ్డు రైల్వేగేటుకు రెండువైపులా మరింత ఇరుగ్గా మారింది. రైల్వేస్టేషన్‌కు వెళ్లే లారీలు, ఆర్వోబీ నిర్మాణ పనులు, సామగ్రి రోడ్డును మరింత ఇరుగ్గా మారుస్తున్నాయి. దీంతో ప్రతీరోజూ రోగులు, నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇంటర్ విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. వచ్చేవారం నుంచి పదో తరగతి విద్యార్థులకు కూడా ఈ టెన్షన్ తప్పేలా లేదు. దీనిపై ఆర్డీవో మహేశ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘భూసేకరణలో చిక్కుల కారణంగా.. ఆర్వోబీ నిర్మాణంలో జాప్యం అవుతున్న మాట వాస్తవమే. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేవారం భూసేకరణ చిక్కులు తొలగేలా ఉన్న జీవోను మార్చి కొత్త జీవో ఇస్తుంది. దీంతో చిక్కులు తొలగి.. ఆర్వోబీ నిర్మాణం వేగం పుంజుకుంటుంది’’ అని తెలిపారు.
తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్దకు రాగానే ఇంటర్ పరీక్షలు రాసే తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలవుతోంది. వరుసగా వస్తున్న రైళ్ల కారణంగా ఒక్కోసారి అరగంట వరకు ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మరీ అధికమవుతోంది. త్వరలోనే పదో తరగతి పరీక్షలు మొదలవనున్నాయి. గేటు పడటం వల్ల ప్రతీరోజూ అంబులెన్స్‌ల్లో రోగులకు ప్రాణసంకటంగా మారింది. సమస్యను త్వరగా పరిష్కరించాలి.
– వేల్పుల వెంకటేశ్, నగరవాసి


