కరీంనగర్ అర్బన్: ఫోర్టిఫైడ్ కర్నెల్స్(ఎఫ్‌ఆర్‌కె) బియ్యం సరఫరా ఇక నిలిచిపోనుంది. ప్రభుత్వ అవసరాలతో పాటు రేషన్ కార్డుదారులకు అందిస్తున్న సదరు బియ్యాన్ని వెంటనే నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వమిచ్చే బియ్యాన్ని మరాడించకుండానే మాయం చేసిన మిల్లర్లలో ఆందోళన నెలకొంది. మిల్లర్ల మెడలు వంచైనా బకాయిలు రాబట్టాలని మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేఽశంలో సీఎం స్పష్టం చేసిన విషయం తెలి సిందే. దీంతో మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా కేంద్ర తాజా నిర్ణయంతో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా తయారైంది. మరింత నాణ్యంగా, సమర్థవంతంగా పోషకాలు అందించే విధానాన్ని గుర్తించే వరకు బ్రేక్ పడనున్నట్లు పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనుకున్న స్థాయిలో ఫలితం లేకపోవడం
ఎఫ్‌ఆర్‌కే బియ్యం ద్వారా లబ్ధిదారులకు పోషకాలను అందించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. గతంలో అనీమియా, పోషక లోపాలు గల పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారని సర్వే ద్వారా గుర్తించింది. సదరు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి–12 వంటి పోషకాలు కలిపి ఉంటాయి. ఫోర్టిఫైడ్ బియ్యం కలిసిన వాటిని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు, మధ్యాహ్న భోజన పథకం, ప్రభు త్వ హాస్టళ్లకు అందిస్తున్నారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న ఎఫ్‌ఆర్‌కే బియ్యం వల్ల అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదని గుర్తించి నిలిపివేశారు.
ఇక పాత పద్ధతిలోనే సేకరణ
మిల్లర్లు ఇచ్చే బకాయి బియ్యంలో, కొత్తగా సేకరించే వాటిలో ఫోర్టిఫైడ్ బియ్యం కలపకుండానే తీసుకోవాలని నిర్ణయించారు. ఎవరి దగ్గర ఎంత ఫో ర్టిఫైడ్ బియ్యం నిల్వ ఉందో ఈనెల 30లోపు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలి. ఆ తేదీ తరువాత ఎఫ్‌ఆర్‌కే బియ్యం కలపకుండా సరఫరా చేయాలి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వ అవసరాలకు ఎఫ్‌ఆర్కే బియ్యం వాడుకోవచ్చు. అవకాశం ఉన్నవారు నాన్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేసుకోవచ్చు. 2025–26 యాసంగి పంట నుంచి కేవలం నాన్ ఫోర్టిఫైడ్ బియ్యమే మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త విధానం అమలులోకి వచ్చే లోగా ఫోర్టిఫైడ్ రహిత బియ్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లు అంతర్మథనంలో పడ్డారు. ధాన్యాన్ని అమ్ముకుని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగా రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే బియ్యాన్నే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. అధికారుల సంపూర్ణ మద్దతు ఉండటంతో ఇదే దందా సాగింది. ఎఫ్‌ఆర్‌కే లేకుండా బియ్యం ఇవ్వాలంటే కష్టమే. రేషన్ మాఫియా వద్ద బియ్యం కొనుగోలు చేస్తే వారి వద్ద ఉండేది ఎఫ్‌ఆర్‌కే బియ్యమే. ఈ నెల 30లోగా తమ వద్ద ఎంతవరకు ఎఫ్‌ఆర్‌కే బియ్యం ఉందనే వివరాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.


