● మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్‌కార్పొరేషన్: వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. కళాభారతిలో బుధవారం రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025 –26 ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగియనున్నందున నిర్ణీత లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూలు చేయాలన్నారు. మిగిలిన 26 రోజు ల్లో మరో రూ.30 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నందున, ప్రణాళిక ప్రకారం లక్ష్యం చేరాలన్నారు. ప్రజలు చెల్లించే ఆస్తిపన్నుతో నగర అభివృద్ధి సాధ్యపడుతుందనేది అవగాహన కల్పించాలని సూచించారు. పన్నువసూళ్లలో సంబంధిత కార్పొరేటర్ల సహకారం తీసుకో వాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేయాలని, ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ మొండిబకాయిదారులకు రెడ్‌నోటీసులు జారీ చేయాలన్నారు. చెల్లించని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, నల్లా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తొలగించాలన్నారు. వ్యాపారులు పన్నులు చెల్లించకుంటే దుకాణాలను సీజ్ చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికే లక్ష్యం చేరుకొనేలా చర్యలు చేపట్టాలన్నారు. విలీన గ్రామల ప్రజలు కూడా డిమాండ్ ప్రకారం పన్నులు తప్పక చెల్లించాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు వేణు మాధవ్, ఖాదర్ మొహియుద్దీన్, ఎస్‌ఈ రాజ్ కుమార్ పాల్గొన్నారు.


