కువైట్‌ ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ దాడి.. భారతీయుడి మృతి | Indian National Death In Iranian Drone Attack On Kuwait Airport | Sakshi
Sakshi News home page

కువైట్‌ ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ దాడి.. భారతీయుడి మృతి

Jun 3 2026 5:13 PM | Updated on Jun 3 2026 5:17 PM

Indian National Death In Iranian Drone Attack On Kuwait Airport

కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్‌ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి  చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.

మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్‌కు భారీ నష్టం కలిగింది.

కాగా, కువైట్‌లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా దాడులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement