
అగ్నిమాక సిబ్బందికి ఇంత గౌరవ మర్యాదలిస్తారా అని అబ్బురపడింది ఓ భారత సంతతి మహిళ. అస్సలు ఇది ఊహించలేదు. సరదాగా మా నాన్నని లండన్ తీసుకువస్తే..ఇంతలా గౌరవ మన్ననలను అందుకుంటాడని అనుకోలేదంటూ ఖుషీ అవుతోంది ఆ మహిళ.
అసలేం జరిగిందంటే..UKలో నివసిస్తున్న భారత సంతతి మహిళ పూజా ఖర్బ్ తన నాన్నను లండన్ పర్యటనకు తీసుకువచ్చినప్పడు ఎదురైన అనుభవాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు. నిజానికి ఆమె తండ్రి ఢిల్లీలో అగ్నిమాపక సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన తన కూతురితో కలిసి లండన్ వెళ్లారు. అక్కడకు ఆ తండ్రి తనవెంట ఐడీ కార్డుని కూడా తీసుకుని వెళ్లాడు. అక్కడ తన అగ్నిమాపక దళం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఇలా లండన్‌కి తన ఐడీ కార్డుని తెచ్చుకున్నాడు.
తన కూతురు పూజాతో లండన్‌కి వచ్చిన అతడు..నేరుగా తన వృత్తికి సంబంధించిన అగ్నిమాపక స్టేషన్‌ని సందర్శించేందుకు వెళ్లాడు. అక్కడ తన ఐడీ కార్డుని చూపించగానే అక్కడి అధికారులు అతనికి అగ్నిమాపక కేంద్రాన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూసే అవకాశం లభించడమే గాక, అక్కడ అతనికి మంచి గౌరవ మర్యాదలు కూడా లభించాయి. పైగా అక్కడ అగ్నిమాపక సిబ్బంది జాకెట్ ధరించి ఓ ఫోటో కూడా దిగాడు. అంత దూరం నుంచి కూతురు కారణంగా లండన్ వచ్చిన ఆ తండ్రికి అక్కడి అగ్నిమాపకదళం అందించిన గౌరవమర్యాదలకు ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు.
అది చూసి కూతురు పూజా ఈ లండన్ పర్యటనకు తీసుకువచ్చి మంచి పనిచేశా, ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారంటూ తెగ సంబరపడింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా పంచుకుంది. అయితే నెటిజన్లు ఇక్కడ భారతీయ అగ్నిమాపక సిబ్బందికి అంతటి గుర్తింపు లభించడం లేదని వాపోవడమే గాక, ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగాలను లేదా అగ్నిమాపక సిబ్బందిని ఎవరూ అభినందించరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అలాగే లండన్ అగ్నిమాపక శాఖ కూడా పూజా షేర్ చేసిన వీడియోపై స్పందించింది. ఇలా మా అగ్నిమాపక దళాన్ని సందర్శించినందుకు చాలా సంతోషం అని లండన్ ఫైర్ స్టేషన్ బదులివ్వడం విశేషం.
(చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి)