లోహ విహంగం.. విన్యాసాల వైభోగం.. | Wings India–2026 Show In Hydeerabad | Sakshi
Sakshi News home page

లోహ విహంగం.. విన్యాసాల వైభోగం..

Jan 28 2026 8:38 AM | Updated on Jan 28 2026 9:01 AM

Wings India–2026 Show In Hydeerabad

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వేదికగా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

మరికొన్ని గంటల్లో నింగిలో ఎయిరోబాటిక్‌ సాహసాలు 

సూర్యకిరణ్‌ టీమ్, మార్క్‌ జాఫ్రీస్‌ బృందాలు సిద్ధం 

ఎగ్జిబిషన్‌లో విమాన, డ్రోన్ల తయారీ ఉత్పత్తుల ప్రదర్శన

మొన్నటివరకూ పతంగుల పండగ.. ఇప్పుడు విహంగాల పండగ వచ్చేసింది. నగరం మరోసారి అతిపెద్ద విమానాల ప్రదర్శనకు సిద్ధమైంది.. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వేదికగా రెండేళ్లకు ఓమారు జరిగే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన అయిన వింగ్స్‌ ఇండియా–2026 షో మళ్లీ వచ్చేసింది. నాలుగు రోజుల పాటు నగరవాసులను లోహ విహంగాలు అబ్బురపరిచే విన్యాసాలతో కనువిందు చేసేందుకు ఇప్పటికే రన్‌వేపై కొలువుదీరాయి. మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 28 నుంచి 31 వరకూ జరిగే షోలో వివిధ విమాన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దీనికి తోడు వైమానిక విన్యాసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్‌ టీమ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్‌ ఎయిరోబాటిక్‌ టీమ్‌ మార్క్‌ జాఫ్రీస్‌ అద్భుత విన్యాసాలకు రెడీ అవుతున్నారు. 

నాలుగు రోజుల పాటు మొత్తం 13 సార్లు ఆయా ఎయిరోబాటిక్‌ టీమ్‌లు నింగిలో అద్భుతాలను ఆవిష్కరించనున్నాయి. ప్రారంభం రోజు మార్క్‌జాఫ్రీస్‌ బృందం అదనంగా మరో ‘షో’తో పాటు డ్రోన్‌ షో కూడా సందర్శకులను కట్టిపడేయనుంది. అర్కా ఏవియేషన్, హెచ్‌ఏఎల్, శక్తి ఏవియేషన్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌  ప్రైవేట్‌ లిమిటెడ్, దస్సాల్ట్‌ ఏవియేషన్, ఎయిర్‌బస్, ఎబ్రాయెర్, యూఏసీ, టెక్నాం, పిలాటస్, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్‌ తదితర కంపెనీలు స్టాటిక్‌ డిస్‌ప్లేలో పాల్గొంటున్నాయి. అలాగే ఎగ్జిబిషన్‌లో విమానయాన రంగానికి చెందిన ప్రతి ఉత్పత్తినీ తయారీ సంస్థలు ప్రదర్శించనున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు వింగ్స్‌ ఇండియా వేదికగా జరిగే ‘ఇండియన్‌ ఏవియేషన్‌ : పేవింగ్‌ ది ఫ్యూచర్‌–ఫ్రం డిజైన్‌ టు డిప్లాయ్‌మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్‌ టు మెయింటెనెన్స్, ఇన్‌క్లూజివిటీ టు ఇన్నోవేషన్‌ అండ్‌ సొసైటీ టు సస్టెయినబులిటీ’ అంశాలపై సదస్సు జరుగనుంది. భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు హాజరుకానున్నారు.  

2024లో సారంగ్‌.. ఇప్పుడు సూర్యకిరణ్‌.. 
2024లో జరిగిన వింగ్స్‌ ఇండియా షోలో సారంగ్‌ టీమ్‌ హెలికాఫ్టర్లు నగరవాసులను మంత్రముగ్ధులను చేయగా.. ఈసారి సూర్యకిరణ్‌ ఎయిరోబాటిక్‌ టీమ్‌ కనువిందు చేయనుంది. భారత్‌ వైమానిక దళం (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌) అధికారిక ఎయిరోబాటిక్స్‌గా సూర్యకిరణ్‌ ఎయిరోబాటిక్‌ వెలుగొందుతోంది. మొట్టమొదటిసారి హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం వేదికగా జరిగే వింగ్స్‌ ఇండియా–2026లో వైమానిక విన్యాసాలకు రెడీ అవుతున్నారు. 52వ స్కాడ్రన్‌కి చెందిన ఈ టీమ్‌ ‘సదైవ సర్వోత్తమ్‌’ నినాదంగా ముందుకుసాగుతుంది. కర్ణాటక బీదర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కేంద్రంగా ‘సూర్యకిరణ్‌’ టీమ్‌ సేవలందిస్తోంది. 1996లో ఆవిర్భవించిన సూర్యకిరణ్‌ మొదటిసారి కోయంబత్తూర్‌లో 1996 సెప్టెంబర్‌ 15న మొదటి ప్రదర్శన ఇచ్చారు. 1998 నుంచి 9 విమానాల ఫార్మేషన్‌ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టీమ్‌ ప్రస్తుతం బీఏఈ హాక్‌ ఎంకే–132 జెట్‌ ట్రైనర్లను ఉపయోగిస్తుంది. ఇవి ప్రత్యేకంగా ఎయిరోబాటిక్‌ కోసం స్మోక్‌ సిస్టమ్‌తో మార్చబడ్డాయి. మొత్తం 13 మంది ఫైలెట్లు ఉన్నప్పటికీ ప్రతి ప్రదర్శనలో 9 మంది పైలెట్లు మాత్రమే విమానాలు నడిపిస్తారు.

సందడే సందడి..

స్టాటిక్‌ ప్రదర్శనలో ఉంచే లోహ విహంగాలు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ రన్‌ వేపై ఇప్పటికే వాలిపోయాయి. ఇందులో ప్రధానంగా ఎయిర్‌ బాలి్టక్‌ (ఎయిర్‌బస్‌ ఏ 220–300), యూఏసీ ఐఎల్‌ 114–300 రీజనల్‌ టర్బోప్రోప్, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (737–8), సంజయ్‌ గోదావత్‌ గ్రూప్‌కు చెందిన స్టార్‌ ఎయిర్‌ (వీటీ–జీఎస్‌జే), ఆదానీ గ్రూపుకు చెందిన బాలి్టక్‌ (వీటీ–కేజీఏ), న్యూజనరేషన్‌  (ఓకే–జేఆర్‌పీ), హెచ్‌ఏఎల్‌కు చెందిన హిందూస్థాన్‌–228, ధ్రువ్‌ ఎన్‌జీ, ఎస్‌జే–100,  శక్తి ఎయిర్‌ విమానాలు, హెలికాఫ్టర్లు రన్‌వేపై కొలువుదీరాయి. మంగళవారం రాత్రికి మరిన్ని విమానాలు, హెలికాఫ్టర్లు వింగ్స్‌ ఇండియా–2026కి రానున్నట్లు షో వర్గాలు పేర్కొన్నాయి.

మరోసారి మార్క్‌ జాఫ్రీస్‌ బృందం.. 
లండన్‌లో ఎయిరోబాటిక్‌ విన్యాసాలు చేసే మార్క్‌ జాఫ్రీస్‌ బృందం ఈ సారి కూడా గగనంలో అద్భుత వైమానిక విన్యాసాలకు సిద్ధమయ్యారు. వైమానిక విన్యాసాల్లో మార్క్‌ జాఫ్రీస్‌ది ఐదు దశాబ్దాల అనుభవం. ప్రపంచ ప్రఖ్యాత ఎయిరోబాటిక్‌ పైలట్‌. ఎల్‌–39 ఆల్బట్రోస్‌ జెట్‌ విమానాలతో అద్భుత షోలు చేస్తారు. ప్రపంచంలో ఎక్కడ ఎయిర్‌ షోలు జరిగినా ఈ టీమ్‌ వైమానిక విన్యాసాలు ఉండాల్సిందే. హైస్పీడ్‌ జెట్‌ ఫ్లైపాస్ట్, లూప్స్, రోల్స్, క్రాస్‌ ఫ్లైట్‌ మేనూవర్స్, ఫార్మేషన్‌ ఫ్లయింగ్, నైఫ్‌ ఎడ్జ్‌ పాస్, మిర్రర్‌ ఫ్లైయింగ్‌Š వంటి రిస్కీ స్టంట్స్‌కు ప్రసిద్ధి. 2014లో ఈ బృందం మొదటిసారి ఇండియన్‌ ఏవియేషన్‌ షోలో పాల్గొన్నారు. అప్పటి నుంచి రెండేళ్లకోసారి వింగ్స్‌ ఇండియా షోలో విన్యాసాలు చేస్తుటుంది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ స్టార్‌ టీమ్‌ సభ్యులైన మార్క్‌జాఫ్రీస్, క్రిస్‌ హేమ్స్, జాన్‌ రావెన్‌్రస్కోప్ట్, క్రిజ్‌ బర్కెట్‌ల బృందం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు మంగళవారం చేరుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement