కోటి రూపాయల ఉద్యోగం.. జాయినింగ్‌కు ముందే విషాదం..! | Anuroop Reddy Sacrifices Life to Save Friends in Louisiana | Sakshi
Sakshi News home page

కోటి రూపాయల ఉద్యోగం.. జాయినింగ్‌కు ముందే విషాదం..!

Jun 9 2026 11:39 AM | Updated on Jun 9 2026 12:14 PM

Anuroop Reddy Sacrifices Life to Save Friends in Louisiana

నల్గొండ జిల్లా: అమెరికాలో స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన యువకుడు నదిలో జారిపడిన ముగ్గురు స్నేహితులను కాపాడి తాను నీటిలో మునిగి మృతిచెందాడు. వివరాలు.. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన చెందిన కోడూరు రాజేందర్‌రెడ్డి, దుర్గాభవాని దంపతులకు అశ్రిత్‌రెడ్డి, అనురూప్‌రెడ్డి(22) సంతానం. ప్రస్తుతం వారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కవాడిపల్లిలో స్థిరపడ్డారు. 

రాజేందర్‌రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రానికి వెళ్లారు. అశ్రిత్‌రెడ్డిది గతేడాది ఎంఎస్‌ పూర్తికాగా.. అనురూప్‌రెడ్డిది ఇటీవలే కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంఎస్‌ పూర్తిచేశాడు. అశ్రిత్‌రెడ్డికి ఉద్యోగం రాకపోగా.. అనురూప్‌రెడ్డికి ఇటీవలే కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగానికి సంబంధించిన ఓటీపీ రాకపోవడంతో ఉద్యోగంలో చేరలేదు.

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి..
అశ్రిత్‌రెడ్డి, అనురూప్‌రెడ్డితో పాటు మరో నలుగురు స్నేహితులు అమెరికాలో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గత నెల 29న తన స్నేహితుడి పుట్టినరోజు వేడుక కోసమని అనురూప్‌రెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి టెక్సాస్‌–లూసియానా సరిహద్దులో ఉన్న ‘టొలెడోబెండ్‌ రిజర్వాయర్‌’ వద్దకు వెళ్లారు. అక్కడ అనురూప్‌రెడ్డి ఫోన్‌కాల్‌ మాట్లాడుతుండగా.. అతడి ముగ్గురు స్నేహితులు సరదాగా చేపలు పడుతూ కాలుజారి నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు కేకలు వేయడంతో అనురూప్‌రెడ్డి వెంటనే నీటి ప్రవాహంలోకి దూకి ముగ్గురు స్నేహితులను ఒడ్డుకు చేర్చాడు. తాను కూడా ఒడ్డుకు చేరే క్రమంలో ఫిషింగ్‌ వైరు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. అక్కడి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి 20 అడుగుల లోతున ఉన్న అనురూప్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు వెలికితీశాయి. 

చదువులో చురుకు
అనురూప్‌రెడ్డి హైదరాబాద్‌లోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్‌ సెలక్షన్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రూ.40లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో అనురూప్‌రెడ్డికి ఉద్యోగ ఆఫర్‌ ఇచ్చింది. కానీ ఆ ఆఫర్‌ను కాదని అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.

నేడు హైదరాబాద్‌కు రానున్న మృతదేహం..
అనురూప్‌రెడ్డి మృతదేహం మంగళవారం ఉద యం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి నుంచి మృతదేహాన్ని కవాడిపల్లిలోని వారి నివాసానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement