ఆర్మూర్/ వేల్పూర్(ముప్కాల్)/ నిజామాబాద్ రూరల్ : రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు స్వర్ణయుగం నడుస్తోందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బ న్, రూరల్ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపా ఠి తదితరులతో కలిసి శుక్రవారం మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఆర్మూర్, ముప్కాల్, నిజామాబాద్ నగరంలో గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాల ప్రారంభోత్సవం, చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, మహిళా సంఘాలకు రుణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. మహి ళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వం చేయూతను అందిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే 20 వేల పైచిలుకు మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఇది వరకు పింఛన్లు పొందుతున్న వారిలో ఏ ఒక్కరి పింఛన్ కూడా తొలగించలేదని, చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తొలగించబడినట్లు మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే వృద్ధాప్య పింఛన్లు అందజేస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో జిల్లా ఆశించిన విధంగా అభివృద్ధి చెందలేదన్నారు. త్వరలోనే జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సీఎంతో భేటీ అయ్యి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రజాప్రభుత్వం
ప్రజాప్రభుత్వం అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గత పాలకులు అనాలోచిత విధానాలతో ఇబ్బడిముబ్బడిగా చేసిన అప్పులకు ప్రతి నెలా రూ.6 వేల కోట్లను వడ్డీ రూపంలో తమ సర్కారు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్ర మంత్రిని కలుస్తామని, డిచ్‌పల్లిలో అతిథి గృహం, నిజామాబాద్ నగర మాస్టర్ ప్లాన్ అమలు కోసం కృషి చేస్తామన్నారు.
బీమా శిబిరం ప్రారంభం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భూరక్ష యాప్ ఆవిష్కరణ
ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో ట్రెయినీ కలెక్టర్ పి.సురేష్ రూపొందించిన భూరక్ష యాప్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. సాంకేతిక, సుపరిపాలనను అనుసంధానిస్తూ ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు వీలుగా యాప్ రూపొందించడం గొప్ప విషయమని మంత్రి సీతక్క కలెక్టర్, ట్రెయినీ కలెక్టర్లను అభినందించారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు సర్కారు పెద్దపీట
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
జిల్లాలో మంత్రి విస్తృత పర్యటన


