రుద్రూర్ : కోటగిరి మండల కేంద్రంలోని ప్రసిద్ధ విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన కాకడ హారతి కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రమైన పండరీపూర్ సంప్రదాయాన్ని అనుసరిస్తూ అశ్వయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు నిర్వహించనున్న ఈ వేడుకకు భక్తులు పోటెత్తారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు విఠలేశ్వర స్వామివారికి వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అత్యంత భక్తిశ్రద్ధలతో కాకడ హారతి సమర్పించారు. హారతి అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.


