సుభాష్‌నగర్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి సైకిల్‌యాత్ర కొనసాగుతుందని జాతీ య పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి తెలిపారు. ఈమేరకు సోమవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పి తిరు పతిరెడ్డి అధ్యక్షతన సైకిల్ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారెడ్డి, దినేశ్ మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బోధన్ నుంచి ఈనెల 27న సైకిల్ యాత్ర ప్రారంభమవుతుందని, అక్టోబర్ 4న జగిత్యాల వరకు దాదాపు 180 గ్రామాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతుల హక్కుల సాధనకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్న సైకిల్ యాత్రలో రైతులు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల ని వారు కోరారు. సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మ గంగారెడ్డి, నాయకులు అంతిరెడ్డి హరీశ్‌రెడ్డి, తోట చిన్నయ్య, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.


