మాక్లూర్: మంచానికే పరిమితమైన మండలంలోని ధర్మోరా గ్రామానికి చెందిన చాకలి హన్మాండ్లుకు కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని రాము తనవంతుగా సోమవారం రూ. 25 వేల నగదు అందజేశారు. 14 సంవత్సరాల క్రితం చాకలి హన్మాండ్లు బ్రతుకుదెరువు నిమిత్తం గల్ఫ్ కు వెళ్లి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆయన మంచానికి పరిమితమయ్యారు. సర్పంచ్ పందిరి శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం ఉమా కిరణ్, తదితరులున్నారు.
చిన్నారికి చేయూత
కమ్మర్‌పల్లి(మోర్తాడ్): మోర్తాడ్ మండల కేంద్రంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇల్లెందుల రియాకు బషీరాబాద్‌కు చెందిన కేఎన్ ఫౌండేషన్ చేయూత అందించింది. సోమవారం ఫౌండేషన్ సభ్యులు మోర్తాడ్‌లోని రియా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని ఎస్సై బి.రాము చేతులమీదుగా అందజేశారు. కానిస్టేబుల్ జగదీష్, మోర్తాడ్ సదన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పచ్చలనడ్కుడవాసికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
వేల్పూర్: పచ్చలనడ్కుడ గ్రామానికి చెందిన బుర్క గంగాధర్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. టీఏపీటీఏ వ్యవస్థాపకులు చందూలాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
క్షత్రియ పాఠశాల ప్రిన్సిపాల్‌కు..
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని క్షత్రీయ పాఠశాల ప్రిన్సిపల్ నవిత టీఏపీటీఏ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. వరంగల్‌లో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ప్రైవేట్ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
చేయూత దరఖాస్తుల పరిశీలన
డొంకేశ్వర్(ఆర్మూర్): తొండాకూర్‌లో సోమవా రం చేయూత దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగింది. ఎంపీడీవో బుక్య లింగం, స్థానిక సర్పంచ్ గంగాధర్ కలిసి దరఖాస్తుదారుల ఇంటి వద్దకు వెళ్లి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం ఫీల్డ్ వెరిఫికేషన్ పెట్టినట్లు ఎంపీడీవో తెలిపారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రష్మీ గౌతమ్
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ టీవీ యాంకర్ రష్మీగౌతమ్ సోమవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
సాహిత్య సేవకు గుర్తింపు
కమ్మర్‌పల్లి(మోర్తాడ్): మోర్తాడ్ మండలం దోన్‌పాల్ గ్రామానికి చెందిన ప్రముఖ కవి, రచయిత ఇద్రాల బాలరాజుచారికి ‘అక్షర కిరీటి’ బిరుదు లభించింది. భద్రాద్రిలో జరిగిన 176వ జాతీయ స్థాయి కవి సమ్మేళనంలో తెలుగు సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న రచనా కృషిని గుర్తిస్తూ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అక్షర కిరీటి పురస్కారాన్ని అందజేశారు. ‘అక్షర కిరీటి’ బిరుదుతో పాటు మెమెంటోలు, శాలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించారు.


