● బోధన్‌లో లయన్స్ క్లబ్‌ల ఆధ్యాత్మిక సేవ
● నేటి నుంచి 4వేల విగ్రహాల పంపిణీ
బోధన్: పట్టణంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, ఆచన్‌పల్లి క్లబ్‌లు ఆధ్యాత్మిక సేవలోనూ తరిస్తున్నాయి. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా వేల సంఖ్యలో మట్టి గణేశ్ ప్రతిమలను పంపిణీ చేస్తూ సంప్రదాయాన్ని కాపాడుతూ పర్యావరణ హితానికి కృషి చేస్తున్నాయి. గత పన్నెండేళ్లుగా ప్రతి సంవత్సరం 4వేల వరకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. ఈసారి మట్టి వినాయక ప్రతిమలను పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న అంకుటవర్ వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటలకు మట్టి ప్రతిమల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు క్లబ్‌ల ప్రతినిధులు తెలిపారు. ఆర్డీవో విజయకుమారి, ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకట నారాయణ, తహసీల్దార్ విఠల్, లయన్స్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వర్‌రావుల చేతుల మీదుగా ప్రతిమలను పంపిణీ చేస్తామని, పట్టణవాసులు మట్టి ప్రతిమలను పూజించాలని వారు కోరారు.
పర్యావరణాన్ని రక్షిద్దాం
నిజామాబాద్ అర్బన్: మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షిద్దామని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ అన్నారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్‌లో శనివారం మట్టి గణేశ్ ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసి ఉద్యోగులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, టీఎన్జీవోస్ అర్బన్ యూత్ అధ్యక్షులు సృజన్ కుమార్ పాల్గొన్నారు.


