● జిల్లా ఇన్‌చార్జి జడ్జి దుర్గాప్రసాద్
నిజామాబాద్ లీగల్ : పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారంలో లోక్‌అదాలత్‌లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని జిల్లా ఇన్‌చార్జి జడ్జి, నాల్గవ అదనపు జిల్లా కోర్టు జడ్జి ధరావత్ దుర్గాప్రసాద్ అన్నారు. లోక్‌అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకొని కక్షిదారులు మానసిక ప్రశాంతత పొందాలని సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సంస్థలో అదనపు కలెక్టర్ భుజంగ రావు, ఏసీపీ ప్రకాశ్, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి నీలిమతో కలిసి లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌తో ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని, త్వరితగతిన కేసులు పరిష్కారం అవుతాయన్నారు. లోక్‌అదాలత్‌లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీ, న్యాయవాదులు పాల్గొన్నారు.
7,408 కేసుల పరిష్కారం
జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో 7,408 కేసులను పరిష్కరించి రాష్ట్రస్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. పరిష్కరించిన కేసుల్లో 73 సివిల్, 7,228 క్రిమినల్, 107 ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయి. 41 మోటారు వాహన ప్రమాద కేసుల్లో రూ.6,76,91,500 పరిహారంగా అందజేశారు. 43 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.5,12,488, బ్యాంకు కేసుల్లో రూ.47,38,292ను బ్యాంకర్లు–కక్షిదారులకు మధ్య సెటిల్ చేశారు.


