కమ్మర్‌పల్లి(మోర్తాడ్): జీవితాలను చిత్తు చేస్తున్న మత్తును వీడితేనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని ఈగల్ ఫోర్స్ అడ్వైజర్ కొండవీటి శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. కొందరి లాభాపేక్ష మరి కొందరికి ప్రాణ సంకటంగా మారిందన్నారు. శనివారం మోర్తాడ్, భీమ్‌గల్ లింబాద్రి గుట్ట దేవస్థానం వద్ద యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ సేవించడం వల్ల నష్టమే జరుగుతుందని పల్లె పొలిమేరలోకి చేరిన గంజాయిని తరిమేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన ఎలాంటి పదార్థాలు స్వీకరించకూడదని ఆయన సూచించారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. మోర్తాడ్ ఎస్సై రాము, భీమ్‌గల్ ఎస్సై–2 శంకర్, సర్పంచ్ బోగా ఆనంద్, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఊట్నూర్ సాగర్, అడ్వాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


