రుద్రూర్: కొత్త ఓటర్ల నమోదుకు గ్రామాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. చిక్కడపల్లి పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ తారాబాయి శనివారం సందర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై బీఎల్‌వో అశోక్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సర్పంచుల సంఘం
రాష్ట్ర కార్యదర్శిగా లింగం
నందిపేట్ (ఆర్మూర్): నందిపేట గ్రామ సర్పంచ్ ఎర్రం లింగంను ఉన్నత పదవి వరించింది. నందిపేట సర్పంచ్‌గా ఎన్నికై న ఎర్రం లింగం నందిపేట మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతూ నేడు రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ చేతుల మీదుగా ఆయన ఎన్నిక పత్రాన్ని అందుకున్నారు.
అంక్సాపూర్ గ్రామశాఖ
అధ్యక్షుడిగా నేరెళ్ల రాజేశ్వర్
వేల్పూర్: అంక్సాపూర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉప సర్పంచ్ నేరెళ్ల రాజేశ్వర్‌ను శనివారం నియమించారు. ఈ మేరకు ఆయనకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రంగు అనిల్‌గౌడ్ నియామకపత్రం అందజేశారు. సర్పంచ్ తీట్ల శ్రీనివాస్, నాయకులు పాశపు రమేశ్‌బాబు, చరణ్, రమేశ్, బుట్టి మధు, అరుణ్ తదితరులున్నారు.
ముగిసిన శివనామ సప్తాహం
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని పోచా రం కాలనీలో శ్రీ అభయ బసవేశ్వర ఆలయం వద్ద శ్రావణ మాసం పురస్కరించుకుని నిర్వహిస్తున్న అఖండ శివనామ సప్తాహం శనివారం ముగిసింది. బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, ఎన్‌ఆర్‌ఐ కోనేరు శశాంక్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం అన్నదానంచేపట్టారు. బీజేపీ నేతలు ఏముల నవీన్, ఆలపాటి హరికృష్ణ పాల్గొన్నారు.
అన్నప్రసాదం పంపిణీ
వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో శనివారం స్థానిక వీడీసీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ప్రతి ఏటా ఎడ్ల పొలాల అమావాస్య మరుసటి రోజున వీడీసీ ఆద్వర్యంలో అన్నప్రసాదం పంపిణి చేయడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. వీడీసీ అధ్యక్షుడు కొండా అశోక్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు మరమ్మతులకు రూ.4.40 కోట్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని తొండాకూర్ నుంచి గాదేపల్లి వరకు బీటీ రోడ్డుకు మోక్షం కలిగింది. దత్తాపూర్, మారంపల్లి, గంగాసముందర్, నూత్‌పల్లి మీదుగా మొత్తం 9.4 కిలో మీటర్ల రోడ్డు మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.40 కోట్లు మంజూరు చేసింది. ఆర్‌అండ్‌బీ అధికారులు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.


