డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో గ్రామ పంచాయతీల నిధుల లెక్కల పరిశీలన (ఆడిట్) ప్రక్రియ తీవ్ర వి మర్శలకు దారితీస్తోంది. రికార్డుల తనిఖీల్లో అక్రమ వసూళ్ల పర్వం బహిరంగగానే సాగుతోంద నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఆర్థిక లోపాలను, రికార్డుల్లోని తప్పులను దాచిపెట్టి క్లీన్ చిట్ ఇచ్చేందుకు కొంతమంది అధికారులు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల ‘మా మూళ్లు’ సైతం జీపీ ఖాతాల నుంచి చెల్లించినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల ఆడిట్ ఇటీవల ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా నిధులతోపాటు స్థానిక సంస్థల సొంత వనరుల ఖర్చుల లెక్కలను ఆడిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 450 జీ పీల్లో ఆడిట్ పూర్తయ్యింది. మిగతా వాటిల్లో కొనసాగుతోంది. నిధుల దుర్వినియోగాన్ని బయటపెట్టాల్సిన ఆడిట్ వ్యవస్థే.. మామూళ్ల మత్తులో మునిగిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అడిగినంత ఇవ్వకపోతే..
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆడిట్ అధికారులు ముడుపుల కోసం ఒత్తిడి తెచ్చారని పలువురు పంచాయతీ కార్యదర్శులు అంతర్గతంగా వాపోతున్నారు. తమ గ్రామ పంచాయతీల్లో ఎటువంటి లోపాలు లేకున్నా ‘ఆనవాయితీ’ కొనసాగించాలని ఒత్తిడి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ఇచ్చుకోకపోతే, చిన్న చిన్న సాంకేతిక లోపాలను కూడా పెద్దవిగా చూపిస్తూ అభ్యంతరాలు రాస్తారని, తద్వారా తమ ఉద్యోగాలకు ఇబ్బందులు వస్తాయనే భయంతో ఈ ముడుపులు ఇవ్వాల్సి వచ్చిందని కొందరు కార్యదర్శులు వాపోతున్నారు.
ఆడిట్ లొసుగులు బయటపెట్టకుండా
ఉండేందుకు ముడుపులు?
మేజర్ జీపీల్లో ఒకలా..
సాధారణ జీపీల్లో మరోలా..
జిల్లాలో ఆఖరు దశకు చేరుకున్న 2025–26 లెక్కల పరిశీలన
ఆర్మూర్ డివిజన్‌లో పరిధిలో ఉన్న ఓ మారుమూల మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఇటీవల ఆడిట్ జరిగింది. ఆడిట్ అధికారులు అన్ని గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా ఒక జీపీని కేంద్రంగా చేసుకుని లెక్కాపత్రాలను పరిశీలించారు. లెక్కల్లో లోపాలు,
అభ్యంతరాలు లేవనెత్తకుండా ఉండేందుకు జీపీ కార్యదర్శులు ఎప్పటిలాగే ‘ఆనవాయితీ’ని కొనసాగించారు. మేజర్ జీపీలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అలాగే సాధారణ జీపీ అయితే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆడిట్ అధికారులకు ముట్టజెప్పినట్లుగా తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు సాగిందనే ఆరోపణలున్నాయి.


