బీఆర్‌ నేతకు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నేతకు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ అవార్డు

Aug 27 2026 1:24 AM | Updated on Aug 27 2026 1:24 AM

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విభాగంలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బీఆర్‌ నేత ధ్యాన్‌చంద్‌ ఎక్సలెన్స్‌ అవార్డు–2026కు ఎంపికయ్యారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ఒలంపిక్స్‌లో ప్రఖ్యాతిగాంచిన హాకీ క్రీడాకారుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని బహూకరిస్తారు. ఈనెల 29న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ ఆడిటోరియంలో అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ (తెలంగాణ ఇంటెలెక్చువల్స్‌ ఫోరం) అధ్యక్షుడు డాక్టర్‌ రాజ్‌నారాయణ ముదిరాజ్‌ బుధవారం తెలిపారు. తెలంగాణ ఇంటెలెక్చువల్‌ ఫోరం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది వ్యాయామ విద్య, క్రీడలలో సేవలందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును బహుకరిస్తామని ఆయన తెలిపారు.

హత్యారాజకీయాల చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి విమర్శ

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): హత్యా రాజకీయాల చరిత్ర ఎవరిదో బాన్సువాడ ప్రజలందరికీ తెలుసని, ఆది నుంచి హత్యారాజకీయాల్లో మునిగి తేలింది పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, కొద్ది మంది అనుచరులని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న వాస్తవాలు తెలిసినా తెలియనట్లు నటిస్తూ, అనుచరులు చేస్తున్న అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని బాజిరెడ్డి పేర్కొన్నారు. కోటగిరి, వర్ని మండలాల్లో జరిగిన హత్యల వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసు యంత్రాంగం అధికార ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చే కుటుంబం తమదని, అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సీఐల బదిలీలు

నిజామాబాద్‌ అర్బన్‌: మల్టీజోన్‌–1 పరిధిలోని పలువురు సీఐలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్‌ కమిషనరేట్‌లోని పీసీఆర్‌ విభాగంలో పనిచేస్తున్న సండ్ర వీరయ్యను కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ సీఐగా, బండి సంతోష్‌ కుమార్‌ను కామారెడ్డి సీసీఎస్‌ పోలీస్‌ విభాగానికి బదిలీ చేశారు. కామారెడ్డి సీసీఎస్‌ విభాగంలో పనిచేస్తున్న సీఐ రామన్‌ నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పీసీఆర్‌ విభాగానికి బదిలీ అయ్యారు.

నేటి నుంచి

‘సర్‌’ గ్రామసభలు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా నేటి (గురువారం) నుంచి ఎస్‌ఐఆర్‌ గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించి ఎన్నికల నూతన ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించనున్నారు. లిస్ట్‌లో పేర్లు లేని వారికి నోటీసులు అందించి వారి నుంచి వివరణ తీసుకోవడం, జాబితాలో తప్పులపై గ్రామ సభల్లో చర్చించనున్నారు. గ్రామ సభకు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ, గ్రామస్తులు, బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు హాజరుకానున్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి నూతన ఓటు నమోదుకు సంబంధించి ఫారం–6పై అవగాహన కల్పిస్తారు. భారతీయ పౌరుడై ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని వ్యక్తుల వివరాల నమోదు ప్రక్రియపై చర్చిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లు ఉంటే అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే విధానంపై అవగాహన కల్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement