వేల్పూర్(బాల్కొండ): గంజాయి సేవిస్తున్న 31 మందితోపాటు విక్రయిస్తున్న ఐదుగురిని జిల్లాలోని వేర్వేరు చోట్ల పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాల్కొండ మండలం వన్నెల్ (బి) గ్రామ శివారులోని శ్రీరాంసాగర్ వరదకాలువపై గంజాయి సేవిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై శైలేందర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. గంజాయి సేవిస్తున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. విక్రేతను పట్టుకుని విచారించారు. పట్టుబడిన వ్యక్తి నుంచి 40 గ్రాముల ఎండు గంజాయి, చిన్నచిన్న జిప్‌లాక్ కవర్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అందిన సమాచారం మేరకు మల్లన్నగుట్ట వద్దకు చేరుకున్న పోలీసులు.. అక్కడ గంజాయి సేవిస్తున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 31 మందిని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించనున్నామని ఎస్సై తెలిపారు. అలాగే గంజాయి విక్రేతను రిమాండ్‌కు తరలించామన్నారు. రెండు ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆర్మూర్‌లో నలుగురి అరెస్టు
ఆర్మూర్‌టౌన్: పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. నలుగురు యువకులు జర్నలిస్టు కాలనీకి చెందిన సమీర్ అనే వ్యక్తి నుంచి గంజాయికి కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మార్చి యువతకు అమ్ముతు సొమ్మ చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. అలాగే వచ్చిన సొమ్ముతో గంజాయి వినియోగిస్తూ మత్తుకు బానిసైనట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో నుంచి ఇద్దరు గతంలో గంజాయి కేసులో పట్టుబడి జైలుకు వెళ్లివచ్చారని తెలిపారు. 70 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
సేవించిన 31 మందిని
అదుపులోకి తీసుకున్న పోలీసులు
శ్రీరాంసాగర్ వరద కాలువపై
18 మంది..
మల్లన్నగుట్ట వద్ద 13 మంది
విక్రేత అరెస్ట్.. రిమాండ్


