● స్టేషన్ బెయిల్‌కోసం రూ.50 వేలు డిమాండ్ చేసిన ఎస్సై
● అవినీతి నిరోధక శాఖకు
పట్టించిన బాధితుడు
కామారెడ్డిక్రైం/భిక్కనూరు : రాజంపేట ఎస్సై ఆంజనేయులు ఏసీబీకి చిక్కడం మండలంలో హాట్ టాపిక్‌గా మారింది. భిక్కనూరు ఎస్సైగా పనిచేసిన ఆంజనేయులు.. 35 రోజుల క్రితం రాజంపేట ఎస్సైగా బదిలీ అయ్యారు. జూలై 16న ఆయన బా ధ్యతలు స్వీకరించారు. రాజంపేట పట్టణ వైశ్యసంఘం అధ్యక్షుడు అయిన ముత్యపు సిద్దరాములు ఎస్సై ఆంజనేయులను స్వాగతిస్తూ జూలై 21వ తేదీన సన్మానించారు. నాడు స్వాగతించిన చేతులే ప్రస్తుతం ఏసీబీకి పట్టించడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
రాజంపేటకు చెందిన ముత్యపు సిద్దిరాములు, ఆయన కుమారుడు సంతోష్ స్థానికంగా సిమెంట్ దుకాణం నడుపుతున్నారు. వ్యాపార వ్యవహారాల విషయంలో సమీపంలోని మరో సిమెంట్ దుకాణం నిర్వాహకులతో ఈనెల 10న గొడవ జరిగింది. ఇది దాడుల వరకు వెళ్లింది. దీంతో ఇరువర్గాలపై రాజంపేట పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయంలో సిద్దిరాములు కుమారుడు సంతోష్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడం, చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయంలో సెక్షన్‌లలో మార్పులు చేసి సహకరించడానికి ఎస్సై ఆంజనేయులు రూ.50 వేలు డిమాండ్ చేశారు. రూ.40 వేలకు ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. బాధితుడు మొదట రూ.10 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.30 వేలు ఇవ్వాలని ఎస్సై అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని గురువారం ఎస్సై కామారెడ్డిలోని తన నివాసంలో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లంచం డబ్బులను స్వాధీనం చేసుకుని, ఎస్సైని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. సిద్దరాములు గతంలోనూ పౌరసరఫరాల డీటీని ఏసీబీకి పట్టించారు.
ఎస్సై ఆంజనేయులుతో
సిద్దరాములు (ఫైల్)
వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్


