కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రానికి ఆనుకుని నూతనంగా ఏర్పడిన వైఎన్ కాలనీలో బుధవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. తాళం వేసి ఉన్న మూడిళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. రామారెడ్డి రోడ్డులోని గుమాస్తా కాలనీకి సమీపంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లే దారిలో వైఎన్ కాలనీ ఉంది. కాలనీకి చెందిన బండి చంద్రశేఖర్, ఫిరంగి రాజేశ్వర్‌తో పాటు మరో వ్యక్తికి చెందిన ఇళ్ల తాళాలను పగులగొట్టిన దుండగులు సామాన్లన్నీ చిందరవందర చేశారు. మూడిళ్లలో కలిపి 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు దుండగులు ముసుగులు వేసుకుని అనుమానాస్పదంగా కాలనీలో సంచరించినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.


