కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలోగల రైల్వే గేట్ వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లోని రైల్వే గేటుకు ఒకవైపు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయని, ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ఎంపీ పేర్కొన్నారు. రైలు వచ్చినప్పుడల్లా గేటు పడుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారన్నారు. అండర్‌పాస్ నిర్మించి ఇబ్బందులు తప్పించాలని కోరారు. నిజామాబాద్ –కాచిగూడ డెమో రైలును భిక్కనూరులో నిలపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జీఎం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.


