ఖలీల్‌వాడి: ప్రస్తుత సాంకేతిక విద్యావ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలంటూ ఏబీవీపీ నాయకులు, పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అందిస్తున్న సాంకేతిక విద్యను ప్రయివేట్ సంస్థల్లో విలీనం చేయడం సరికాదని, ఇంజనీర్ కావాలనే వారి కలల్ని దూరం చేసి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు అక్షయ్, శివ, దామ సునీల్, బాలకృష్ణ, కన్నా పాల్గొన్నారు.
నందిపేట్‌లో..
నందిపేట్(ఆర్మూర్): రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో–97ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం నందిపేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నందిపేట బస్టాండు ఎదురుగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపి ప్రభుత్వ వైఖరి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను విద్యా చట్టం నుంచి తొలగించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చట్టం పరిధిలోకి చేర్చడం వల్ల నిరుపేద విద్యార్థులకు పాలిటెక్నిక్ చదువు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి అభిప్రాయాలను సేకరించకుండా జీవో తెచ్చారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకులు మచ్చర్ల సాగర్, కోమన్‌పల్లి రాజన్న, ఎర్రటి మెహాన్, గంగాసాగర్, బాబురావు, సుభాష్‌గౌడ్ పాల్గొన్నారు.


