● మూడు నెలల వేతనాలు లాక్కున్న వైనం
● జనగణన అవుట్ సోర్సింగ్ టెక్నికల్
అసిస్టెంట్ల ఆవేదన
నిజామాబాద్‌అర్బన్: జనగణన ప్రక్రియలో పాల్గొ న్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను ఏఎస్‌వో(అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)లు అక్రమంగా తీ సుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఉద్యోగం పోతుందని భయభ్రాంతులకు గురిచేసి మరీ మూడు నెలల వేతనా లు లాక్కున్న ఘటన చర్చనీయాంశంగా మారింది.
38 మంది వేతనాలు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది ప్రారంభమైన జనగణన ప్రక్రియలో భాగంగా రెవెన్యూ శాఖలోని పలువురు అధికారులకు ఏఎస్‌వోలుగా బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు మండలానికి ఒకరు చొప్పున 34 మందిని, ఇతర పనుల కోసం మరో నలుగురిని టెక్నికల్ అసిస్టెంట్లుగా ఓ ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. వీరి నియామకాలను జనవరిలోనే పూర్తి చేయగా, విధుల్లోకి మాత్రం ఏప్రిల్‌లో తీసుకున్నారు. అయితే, మూడు నెలలపాటు జనగణనకు సంబంధించి మ్యాపింగ్ ఇతర కార్యక్రమాలను ఏఎస్‌వోలు నిర్వహించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఏప్రిల్ నుంచి క్షేత్రస్థాయి విధుల్లోకి పంపించారు. ప్రస్తుతం ఏఎస్‌వోలు, టెక్నికల్ అసిస్టెంట్లు కలిసి జనగణన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా, టెక్నికల్ అసిస్టెంట్లకు నెలకు రూ.25 వేలు వేతనంగా కేటాయించి జనవరి నుంచి మంజూరు చేశారు. దీంతో ‘మీరు జనవరి నుంచి విధుల్లోకి రాలేదు.. ఏప్రిల్ నుంచి విధుల్లోకి వచ్చారు కాబట్టి మూడు నెలల వేతనాలు మాకే ఇవ్వాలి’ అని ఏఎస్‌వోలు టెక్నికల్ అసిస్టెంట్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఒక్కో ఉద్యోగికి మూడు నెలల వేతనం రూ.75 వేలు ఇటీవల వారి ఖాతాలో జమ కాగా, ఆ డబ్బులను తమకు ఇవ్వాలంటూ మండలాల్లోని టెక్నికల్ అసిస్టెంట్లను అడుగుతున్నట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పటి వరకు 20 మంది టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి రూ.60 వేల నుంచి రూ.70 వేల చొప్పున స్థానిక ఏఎస్‌వోలు తీసుకున్నట్లు సమాచారం. వేతనాలు ఇచ్చేందుకు కొందరు టెక్నికల్ అసిస్టెంట్లు ససేమిరా అనగా, ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా తీసుకున్నట్లు తెలిసింది. డిచ్‌పల్లి సమీపంలోని ఓ మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ ఖాతాలో పడిన డబ్బులను ఆమె ఇంటికి వెళ్లి స్థానిక అధికారి ఒకరు బలవంతంగా తీసుకున్నట్లు తెలిసింది. ఆర్మూర్ డివిజన్‌లోని ఓ మండలంలో టెక్నికల్ అసిస్టెంట్‌ను ఆర్మూర్ బస్టాండ్‌కు పిలిపించుకొని ఆన్‌లైన్ ద్వారా రూ.60 వేలు వసూలు చేసినట్లు సమాచారం.
కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధం
తమకు వచ్చిన వేతనాలను ఏఎస్‌వోలు తీసుకోవడంతో జిల్లాలోని 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జనవరిలో నియామకమైన తాము శిక్షణలో పాల్గొన్నామని, ఏప్రిల్‌లో ఫీల్డ్‌లోకి వెళ్లినట్లు చెప్తున్నారు. ఏఎస్‌వోలు ఉద్యోగం తీసేస్తామని భయపెట్టడంతోనే డబ్బులు ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


