పెద్దకొడప్‌గల్(జుక్కల్): ఆషాఢ మాసం సందర్భంగా మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వాగు వద్దకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అనంతలోకాలకు చేరుకున్న విషాద ఘటన మండలంలోని చిన్నతక్కడ్‌పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. బిచ్కుంద గ్రామానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ (25)అనే యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి పెద్దకొడప్‌గల్‌లో కొన్ని రోజులుగా పాత ఇనుప సామానుకు వస్తువులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అతడు ఆదివారం మొక్కులు తీర్చుకునేందుకు చిన్నతక్కడ్‌పల్లి గ్రామ శివారులోని వాగు వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులు వంట కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా లక్షణ్ మధ్యాహ్నం సమయంలో స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సాయంత్రం వాగులో గాలింపు చేపట్టగా, లక్ష్మణ్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మృతుడి తల్లి సాయవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేయించామని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.


