కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ ఎస్సీవాడ 2వ వార్డులో వీధిదీపాల కోసం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ప్రమాదవశాత్తు మున్సిపల్ కార్మికుడు రాజు కింద పడిపోయారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. బల్దియా అధికారులకు సమచారం ఇచ్చినా, ప్రమాదం జరిగి రెండు రోజు గడుస్తున్నా మున్సిపల్ ఏఈ, అధికారులు కనీసం స్పందించకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ తీరుపై ఆందోళనలకు దిగుతామని మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు సోమవారం హెచ్చరించారు.
నిజామాబాద్ రూరల్: మండలంలోని కాలూరు చెందిన గంధక్వాడ్ సాయినాథ్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ సోమవారం తెలిపారు. గంధక్వాడ్ మారుతి అతని కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, నాయిగావ్ నుంచి వచ్చి కొన్ని సంవత్సరాలుగా రూరల్ మండలంలోని కాలూరులో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మారుతి కుమారుడు సాయినాథ్ ఈనెల 2న హోటల్‌కు సంబంధించిన వస్తువులను తీసుకురావడానికి జిల్లాకేంద్రానికి వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో సాయినాథ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.


