సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి యూటర్న్ ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ కళాశాల, పాఠశాలలు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నాయి. రోజూ వెయ్యి మందికి పైగా విద్యార్థులు రోడ్డు దాటేందుకు జూనియర్ కళాశాల వద్ద యూటర్న్ ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి కావడంతో వాహనాలు వేగంగా వెళుతుంటాయి. ఇదే సమయంలో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని యూటర్న్ దాటుతున్నారు. రహదారిపై వాహనాలు అదుపుతప్పితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదనలు తయారు చేసినా.. నిర్మాణం కలగానే మిగిలింది.


