రుద్రూర్: దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెన్షన్‌దారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు నిర్వహిస్తామని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ తెలిపారు. పొతంగల్ మండలం సోంపూర్ గ్రామంలో ఆదివారం ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు గైని రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11న బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో దివ్యాంగులకు సంబంధించిన చట్టాలు, సంక్షేమ పథకాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సదస్సును దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవదాస్, మేత్రి చిన్న గంగారాం, శరత్ పవర్, నగేశ్, మహేశ్, గంగాసాగర్, సావిత్రి, హన్మంత్ రావు, గంగారాం పటేల్, బాజీరావు, సాయిలు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.


