ఆర్మూర్: కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెగుల్యర్ బదిలీలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఏళ్ల తరబడి ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తమకు కూడా సాధారణ బదిలీల అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం రిక్వెస్ట్ బదిలీల ద్వారా మాత్రమే కొంతమందికి స్థానచలనం కలుగుతుండగా.. సాధారణ బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రం నిరాశకు గురవుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా బాలికా విద్యను ప్రోత్సహించడానికి కేజీబీవీలను 2011లో ప్రారంభించారు. ఉపాధ్యాయుల(సీఆర్టీ) ను నియమించినప్పటికీ పాఠశాలను నిర్వహించే బాధ్యతలను తొలినాళ్లలో పదవీ విరమణ పొందిన మండల విద్యాధికారులకు అప్పగించారు. 2013 నుంచి కాంట్రాక్టు పద్ధతిపై స్పెషల్ ఆఫీసర్ల నియామకం జరిగింది. 2011లో జిల్లాలో 19 కేజీబీవీలను ప్రారంభించగా ప్రస్తుతం కొత్త మండలాలు ఏర్పాటవడంతో కేజీబీవీల సంఖ్య 27కు పెరిగింది. ఈ ఏడాది 11 కేజీబీవీల్లో ఇంటర్ వరకు 16 కేజీబీవీల్లో పదో తరగతి వరకు 7,160 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీటిల్లో మొత్తంగా 27 మంది స్పెషల్ ఆఫీసర్లతో పాటు సుమారు 135 మంది సీఆర్టీలు, 77 మంది పీజీ సీఆర్టీలు, 24 మంది పీ ఈటీలు, 26 మంది ఏఎన్‌ఎంలు, 212 మంది ఆపరేటర్లు, వాచ్‌మన్‌లు, కుకింగ్ స్టాఫ్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే 15 ఏళ్లుగా కేజీబీవీల్లో సాధారణ బదిలీల ప్రక్రియ జరగడం లేదు. నాలుగేళ్ల నుంచి రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్లు మాత్రం చేశారు.
15 ఏళ్లుగా ఒకే చోట విధులు..
కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్ అంటే ప్రధానోపాధ్యాయురాలు, వార్డెన్ రెండు బాధ్యతలు కలిపి ఒకే వ్యక్తి చూడాలి. ఉదయం నుంచి రాత్రి వరకు పాఠశాల అడ్మినిస్ట్రేషన్, విద్యార్థుల చదువులు, హాస్టల్ మెనూ, సరుకులు, అటెండెన్స్, ఆర్థిక లెక్కలు అన్నీ వీరే చూసుకోవాలి. 15 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహించడం వల్ల కొందరు అనుభవంతో బాగా రాణిస్తున్నా, మరికొందరిలో నిర్లక్ష్యం, ఏకపక్ష నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్‌వోలతో పాటు సీఆర్టీలు, పీజీ సీఆర్టీలకు రెగ్యులర్ బదిలీలు లేని కారణంగా సానుకూల, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఏళ్ల తరబడి ఒకే ఉపాధ్యాయులు చదువు చెప్ప డం వల్ల ఆ సబ్జెక్టుపై విద్యార్థుల ఇంట్రెస్టు తగ్గిపో యే ప్రమాదం లేకపోలేదు. ఇక ఎస్‌వోలకు పనిభా రం విపరీతంగా ఉంది. అలాగే ప్రధానోపాధ్యా యురాలు, వార్డెన్ పోస్టులను వేరు చేయాలి. లేకుంటే బాలికల భవిష్యత్తు అనే నినాదంతో ప్రారంభించిన కేజీబీవీల లక్ష్యం నీరుగారే ప్రమాదం లేకపోలేదు. బదిలీలు లేక స్తంభించిపోయిన ఈ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఉపాధ్యాయ సంఘాల వారు రాష్ట్ర ప్రభుత్వాని కి సమయానుకూలంగా విన్నవించుకుంటూనే ఉన్నారు.
కృత్రిమ మేధతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం
రిక్వెస్ట్ బదిలీలే దిక్కు..
రెగ్యులర్ బదిలీలకు ఎదురుచూపులు
ఏళ్లుగా ఒకే చోట విధులు
బదిలీ విధానం అమలు చేయాలని
ఉపాధ్యాయుల విజ్ఞప్తి


