జాగ్రత్తలు తప్పనిసరి
● వ్యక్తిగత డేటా దుర్వినియోగంతో
సైబర్ నేరాలు
● ఆర్థిక మోసాలకు అవకాశం
సదాశివనగర్: పాత ఫోన్లకు ప్లాస్టిక్ సామన్లు ఇస్తామంటూ ఊరూరా జరుగుతున్న ఈ వ్యాపారం వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉంటోంది. ప్రజలకు చిన్న పాటి ప్లాస్టిక్ సామన్లు ఎరవేసి పాత ఫోన్లను కొత్త నేరాలకు కేటుగాళ్లు వాడుకుంటున్నారు. తక్కువ మొత్తం డబ్బుకు ఆశపడి పాత ఫోన్లను అప్పగించడం చేస్తే నేరాల వలలో చిక్కే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత ఫోన్ల కొనుగోలు, విక్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల చేతికి..
పల్లెలు, పట్టణాల్లో సేకరించిన పాత ఫోన్లను చాలా వరకు ఝార్ఖండ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల అడ్డాలకు వీటిని తరలిస్తారు. మరమత్తులు చేసి నకిలీ పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను అందులో వేసి మోసాలకు పాల్పడుతారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని పాత ఫోన్లకు సేకరించిన వారికి కమీషన్‌గా చెల్లిస్తున్నారు.
ఆర్థిక మోసాలకు అవకాశం
పాడైన ఫోన్లలో సిమ్‌కార్డు మర్చిపోయినా, డేటాను ఫార్మాట్ చేయకపోయినా ఇబ్బందులు తప్పవు. వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు నంబర్లు నేరగాళ్లకు చిక్కితే వారి నుంచి ఆర్థిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. పాత ఫోన్లలో బ్యాంకింగ్ యాప్‌లు, చెల్లింపుల వివరాలు కనిపిస్తే ఆర్థిక పరమైన మోసాలు జరగవచ్చు. ప్రతి ఫోనుకు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిడీ(ఐఎంఈఐ) నంబరు ఉంటుంది. సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసులు ఈ నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తారు. పాత ఫోన్ అమ్మిన వ్యక్తిని అపరాధిగా తేలుస్తారు. అసలు నేరం చేసిన వారు తప్పించుకుంటారు.
వివరాలు నమోదు చేసుకోవాలి
ఎవరైనా వ్యక్తికి, డీలర్‌కు ఫోన్ విక్రయిస్తే వారి చిరునామా, ఆధార్, వివరాలు సేకరించాలి. ఫోన్ అమ్మినట్లుగా(ఐఎంఈఐ) నంబరు, విక్రయించిన తేదీ, పేర్కొంటు రసీదు పొందాలి. విక్రయించారనే సమాచారం ఉంటే భవిష్యత్తులో ఆ ఫోన్ ద్వారా నేరం జరిగినా పోలీసు దర్యాప్తు నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.
పాత ఫోన్లను గుడ్డిగా కొనడం, విక్రయించడం చేయొద్దు. అవసరమైతే తప్ప గుర్తుతెలియని వారి నుంచి పాత ఫోన్‌లను కొనుగోలు చేయొద్దు. గ్రామా ల్లో తిరుగుతూ పాత ఫోన్లను తీసుకుని వస్తువులు ఇచ్చే వారిని నమ్మొద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
– సంతోష్‌కుమార్, సీఐ, సదాశివనగర్


