బాల్యాన్ని ‘దారి’తప్పిస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

బాల్యాన్ని ‘దారి’తప్పిస్తున్నారు..

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

నిజామాబాద్‌ అర్బన్‌ : పోలీసుల నిఘా పెరగడంతో నేరగాళ్లు తమ పంథాను మార్చుకుంటున్నారు. మైనర్లతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా పాత నేరస్తులు, కొందరు నేరచరిత్ర లేని వారు ప్రధాన సూత్రధారులుగా ఉంటూ టీనేజర్లతో నేరాలు చేయిస్తున్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

బానిసలుగా మార్చి.. నేరాల వైపు

నగరంలోని మూడో టౌన్‌ పరిధిలో ధనుష్‌ అనే వ్యక్తి పలువురు మైనర్ల ఆర్థిక అవసరాలను తీరుస్తూ వారి ఇంటిలోనే బంగారం దొంగతనం చేసేలా ప్రేరేపిస్తూ ఇటీవల 10 తులాల బంగారాన్ని దోచుకున్నాడు. ఈ విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. నందిపేట మండల కేంద్రంలో ఓ బాలుడు చైన్‌ స్నాచింగ్‌కు ప్రయత్నించి దొరికిపోయాడు. ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలు దొంగతనాలలో ముగ్గురు మైనర్లు వెలుగులోకి వచ్చారు. జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్‌కు చెందిన వ్యాపారి మైనర్లకు డబ్బులు, ద్విచక్ర వాహనం సమకూరుస్తూ గంజాయి విక్రయిస్తున్నాడు. మాలపల్లి, అర్సపల్లికి చెందిన మరో ఇద్దరు గంజా వ్యాపారస్తులు పిల్లలతో పాఠశాలలు, కళాశాలల వద్ద గాంజా విక్రయిస్తున్నారు. అయితే, కొన్ని ముఠాలు మైనర్లకు మొదటగా మద్యం, గంజాయి, జల్సాలకు అలవాటుపడేలా చేసి ఆ తర్వాత వాటి కోసం ఎలాంటి పని అయినా చేసేందుకు వెనుకాడకుండా తయారు చేస్తున్నట్లు తెలిసింది. డబ్బు, సెల్‌ఫోన్లు, బైక్‌లు, కొత్తబట్టలు తదితర వాటికి డబ్బులు తేలికగా వస్తుండటంతో సూత్రధారులు చెప్పినట్లు చేస్తున్నారు. ఇలా మైనర్లను దొంగతనాలకు వినియోగించుకుంటూ కొందరు నేరగాళ్లు అక్రమంగా సంపాదిస్తున్నారు.

నేరాలకు పాల్పడే వారిలో మైనర్లు ఉండటానికి అనేక కారణాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించకపోవడం. చదువు మానేసిన పిల్లలు ఆర్థిక అవసరాల కోసం తప్పటడుగులు వేస్తున్నారు. పేదరికంలో ఉన్న వారి పిల్లలు ఈజీగా డబ్బు సంపాదించవచ్చని నేరగాళ్లతో జతకడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

అడ్డాలుగా శివారు ప్రాంతాలు!

మైనర్లు, యువత పెడదారి పట్టేందుకు మండల, పట్టణ కేంద్రాల శివారు ప్రాంతాలే అడ్డాలుగా మారుతున్నట్లు సమాచారం. టీ పాయింట్లు, పాన్‌ షాపులు తదితర వాటి వద్ద సూత్రధారులు కొందరు చదువు మధ్యలో ఆపేసిన పిల్లలతోపాటు విద్యార్థులు, యువతను మభ్యపెడుతున్నట్లు తెలిసింది. టీనేజర్లకు మద్యం, గంజాయి, ఇతర మత్తుకు అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇస్తామని ఆశచూపుతూ గంజాయి సరఫరా, చైన్‌ స్నాచింగ్‌, దొంగతనాలకు పాల్పడేలా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.

పుస్తకాలు పట్టాల్సిన చేతులు.. మహిళల మెడల్లోని చైన్‌లు లాగుతున్నాయి. ఆటలాడాల్సిన వయసులో దొంగతనాలకు అలవడుతున్నారు. తరగతి గదిలో ఉండాల్సిన పిల్లలు పోలీసు స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. డబ్బు, మొబైల్స్‌ ఆశ చూపుతూ.. బీరు, బిర్యానీ అలవాటు చేస్తూ కొన్ని నేరప్రవృత్తి కలిగిన ముఠాలు బాల్యాన్ని దారితప్పిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల పలు కేసుల్లో మైనర్లే కీలకం కావడం విస్తుగొలుపుతుంది.

కఠిన చర్యలు తీసుకుంటాం..

నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మైనర్లు నేరాల్లో వస్తున్న కేసుల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. మళ్లీ నేరాలకు పాల్పడకుండా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. తల్లిదండ్రుల నియంత్రణ లేనివారు కొందరు నేరాల్లోకి వస్తున్నారు. – ప్రకాశ్‌ యాదవ్‌, ఏసీపీ

అవగాహనే ముఖ్యం

మత్తుకు అలవాటుపడిన వారు ఎలాంటి పనులు చేయడానికై నా సిద్ధంగా ఉంటారు. పిల్లలకు చెడు వ్యసనాలపై ముందుగానే అవగాహన కల్పించారు. క్రమశిక్షణ ఎంతో అవసరం. పిల్లలపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలి. అలవాట్లలో తేడా కనిపిస్తే తక్షణమే స్పందించాలి.

– డాక్టర్‌ విశాల్‌, మానసిక వైద్యనిపుణులు

డబ్బు ఆశ చూపుతూ..

మైనర్లతో నేరాలు చేయిస్తున్న ముఠాలు

చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లోకి పిల్లలు

మొబైల్స్‌, గంజాయి ఇతర అవసరాల కోసం దొంగతనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement