చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
వర్ని: మండలంలోని తగిలేపల్లి ఊర చెరువులో చేపల వేటకు వెళ్లిన పిట్ల లచ్చిరాం(48) అనే వ్యక్తి మృతి చెందినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈనెల 6న చేపల వేటకు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు చెరువులో పడగా శనివారం మృతదేహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు..
నిజామాబాద్ రూరల్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఒకటో డివిజన్ కాలూర్‌కు చెందిన చిట్టి కుమార్(38) మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తితో ఈ నెల 2న ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు.
రైలు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని రైల్వేగేట్ వద్ద పట్టాలు దాటుతున్న ముల్ల సురేశ్‌ను రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడం, తీవ్ర రక్తస్రావం వల్ల సురేశ్ పరిస్థితి విషమంగా వైద్యులు పేర్కొన్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. క్షతగాత్రుడు ప్రస్తుతం స్పృహలో లేడని, అతడు స్పృహలోకి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. డిచ్‌పల్లికి చెందిన సురేశ్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం.
కారు ఢీకొని మరొకరికి..
డిచ్‌పల్లి: మండలంలోని బర్ధిపూర్ శివారులో బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలైనట్లు ఎస్సై ఎండీ ఆరీఫ్ శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఘన్‌పూర్ గ్రామానికి చెందిన అప్సర్ అనే వ్యక్తి జిల్లా కేంద్రానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొన్నది. ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.


