మంజీర నదిలో దూకిన వ్యక్తి మృతి
మద్నూర్(జుక్కల్): రెండు రోజుల క్రితం కుర్లా సమీపంలోని మంజీర నదిలో దూకిన వ్యక్తి మృతి చెందినట్లు శుక్రవారం ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. డోంగ్లి మండలంలోని ఎన్‌బుర గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్(53) కుటుంబ సభ్యులతో గొడవ పడి మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై తెలిపారు. బుధవారం సాయంత్రం షబ్బీర్ తన భార్య పిల్లలతో గొడవ పడి మంజీరా నదిలో దూకుతున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నదిలో దూకినట్లు ఎస్సై చెప్పారు. బుధవారం రాత్రి కావడంతో గాలింపు చేపట్టలేకపోయామని గురువారం గజ ఈత గాళ్లతో మంజీరా నదిలో బోటుతో సహాయంతో గాలించగా రాత్రి షబ్బీర్ మృతదేహం లభించిందని అన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సిరికొండ: మండలంలోని జంగిలోడి తండాలో గురువారం అర్ధరాత్రి బుక్యా రాములుకు చెందిన పశువుల షెడ్డులో అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు శుక్రవారం తెలిపారు. ప్రమాదంలో షెడ్డులో ఉన్న రెండు ఎడ్లలో ఒక ఎద్దు మృతి చెందగా మరో ఎద్దుకు గాయాలయ్యాయి. గడ్డి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో బాధితుడికి రూ. రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
వర్ని: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


