నిజామాబాద్ అర్బన్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు జయశంకర్ అని ప్రశంసించారు. 1969 ఉద్యమంతోపాటు మలి విడత ఉద్యమంలోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఆశ, శ్వాసగా ఆరు దశాబ్దాలపాటు సుదీర్ఘంగా అలుపెరుగని కృషి చేస్తూ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారని అన్నారు. అంతకుముందు కంఠేశ్వర్ చౌరస్తాలో గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ వి భుజంగరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా సంఘాల బాధ్యులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్‌వో గీత, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ట్రెయి డిప్యూటీ కలెక్టర్ సందీప్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారిణి రజిత, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


