● మునిగిన పంటలు
● దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్డు
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ ఊర చెరువు కట్ట తెగిపోయింది. గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి చెరువు కట్టకు లీకేజీ ప్రారంభమై తొమ్మిది గంటల వరకు పూర్తిగా తెగిపోయింది. కట్ట తెగిపోవడంతో చెరువులో నీరంతా వృథా పోయింది. చెరువు నీరు వాగులో కలిసే ప్రదేశం వరకు పొలాలన్నీ జలమమయ్యాయి. వరద ఉధృతికి పొలాలు చాలా మేర ధ్వంసమయ్యాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. కొండాపూర్–తూంపల్లి మధ్య పీఆర్ రోడ్డు, కొండాపూర్– ఒంటిప్పతండా మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డు ధ్వంసమైంది. రెండు చోట్ల వరద రోడ్డు పైనుంచి పొంగడంతో పెద్ద ఎత్తున కోతకు గురైంది. ఆ మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రాజశేఖర్ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు.


