● భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
● అనాథలైన ముగ్గురు పిల్లలు
● అంచనూరులో తీవ్ర విషాదం
నీవు లేక నేనుండలేనంటూ..
దోమకొండ : భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జోగిని సందీప్ (26) తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య జోగిని మౌనిక జూలై 16న అత్త, మరిది వేధింపులతో బలవన్మరణానికి పాల్పడింది. కాగా సందీప్, మౌనిక దంపతులకు ఐదేళ్ల ఆరాధ్యతోపాటు ఏడాదిన్నర కవల కుమారులు ఆద్విత్, ఆద్యయత్ ఉన్నారు. మౌనిక మృతి చెందిన నాటి నుంచి సందీప్ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. చిన్న పిల్లలు ఉన్నారని, వారిని చూసుకోవాలని తండ్రి, బంధువులు సముదాయిస్తూ వస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున పిల్లల ఏడుపులు విన్న మృతుడి తండ్రి నారాయణ వెళ్లి చూడగా మౌనిక ఆత్మ హత్యకు పాల్పడిన గదిలోనే సందీప్ సైతం ఉరేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై ప్రభాకర్ పరిశీలించారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చిన్న వయసులోనే దంపతులు బలవన్మరణానికి పాల్పడి చిన్నారులను అనాథలను చేశారంటూ బంధువుల రోదించారు. కాగా, మౌనిక ఆత్మహత్య కేసులో అత్త, మరిది ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
51 మెట్రిక్ టన్నుల కలప పట్టివేత
● ఇద్దరు అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు
బోధన్: రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని బొగ్గు తయారీ డిపోలో అక్రమంగా నిల్వ చేసిన 51 మెట్రిక్ టన్నుల కలపను పట్టుకున్నట్లు నిజామాబాద్ డివిజన్ అటవీశాఖ అధికారి కే సుధాకర్ రావు బుధవారం తెలిపారు. అటవీ సంపదను అక్రమంగా నిల్వ చేసి బొగ్గు తయారీకి వినియోగిస్తున్నారని గుర్తించి మంగళవారం తనిఖీలు చేశామన్నారు. తనిఖీలో వేప, మామిడి, తుమ్మ, ఇతర వృక్షజాతులకు సంబంధించిన 51 మెట్రిక్ టన్నుల కలపను గుర్తించినట్లు పేర్కొన్నారు. డిపో నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు.


