ఆర్మూర్/కమ్మర్‌పల్లి: బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని, ఎమ్మెల్యేలు పైడి రాకేష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైద్య రంగ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకే
ష్‌రెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెల్లారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత, డిజిట్‌ల్ ఎక్స్‌రే మిషన్, ఆల్ట్రా సౌండ్ మిషన్, ఈసీజీ మిషన్, ఓటీ పరికరాలు, నవజాత శిశు వార్మర్లు, క్రాస్ కార్డ్స్, వీల్ చైర్లు మంజూరు చేయాలని కోరారు. బయో మెడికల్ వ్యర్ధాల గది, మెకనైజ్డ్ ల్యాండ్రీ, కిచెన్ షెడ్ టాయిలెట్స్ మౌలిక సదుపాయాల మంజూరు చేయాలని కోరారు. ఆర్మూర్ మండలం అంకాపూర్, పిప్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మచ్చర్లలో ఆరోగ్య ఉప కేంద్రం, నందిపేట, మాక్లూర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మంజూరు చేయాలని కోరగా అంకాపూర్‌లో పీహెచ్‌సీ, నందిపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారని ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే భీమ్‌గల్‌లో 100 పడకల ఏరియా ఆస్పత్రి పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి కోరారు. రాహత్ నగర్‌లో నూతన పీహెచ్‌సీ భవనం నిర్మాణం చేపట్టాలన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొత్త పీహెచ్‌సీ, బాల్కొండలో సీహెచ్‌సీ కొత్త భవన నిర్మాణం, బాల్కొండ, మోర్తాడ్‌లో పోస్టుమార్టం భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. అలాగే సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. మొత్తం 18 ఆరోగ్య ఉపకేంద్రాలు / ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి, నిధులు విడుదల చేయవలసిందిగా కోరారు.జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ మెషిన్‌ను మంజూరు చేయాలనీ విన్నవించారు.


