బస్సు ఢీకొని యువకుడి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండల కేంద్ర శివారులో ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందెడ్ చెందిన గైక్వాడ్ రుషికేష్(22) దేగాంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం అతడు ఆలూర్‌లో పని ముగించుకొని బైక్‌పై తిరిగి దేగాంకు బయలుదేరాడు. ఆలూర్ శివారులో నందిపేట్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రుషికేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
● ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
బోధన్‌రూరల్: బోధన్‌లో జరిగిన ఉర్సులో పాల్గొన్న ఇద్దరు యువకులు తిరిగి సొంతూరుకి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని బిలోలి తాలూకా కార్ల గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ (30) తన స్నేహితుడు పింజారి ఇర్ఫాన్ (22)తో కలిసి బోధన్‌లో జరిగిన ఉర్సులో శుక్రవారం పాల్గొన్నారు. తిరిగి బైక్‌పై అర్ధరాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. సాలూర క్యాంపు సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే బిలోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షేక్ అహ్మద్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించగా, ఇర్ఫాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడు షేక్ చాంద్ పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


