డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి గానూ మంజూరైన 13 గెస్ట్ ఫ్యాకల్టీ (అతిథి అధ్యాపకులు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22వరకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్వూలు ఈ నెల 23న ఉంటుందని అన్నారు. బోటనీ 1, కెమిస్ట్రీ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్టికేషన్స్ 1, మాథ్స్ 1, ఫిజిక్స్ 2, జువాలజీ 1, ఎకనామిక్స్ 1, హిస్టరీ 1, పొలిటికల్ సైన్స్ 1, కామర్స్ 2, ఇంగ్లిష్ 1, తెలుగు 1 మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
రుద్రూర్: పొతంగల్ మండలం సుంకిని శివారులో కుక్కల దాడిలో ఓ కృష్ణజింక మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. సుంకిని శివారులో సంచరిస్తున్న కృష్ణజింకపై కుక్కలు దాడి చేశాయి. దీనిని గమనించిన ఓ రైతు కుక్కలను తరిమికొట్టి జింకను గ్రా మంలోకి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే జింకకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ గ్రామానికి చేరుకుని జింకను పరిశీలించారు. తీవ్రగాయాల కారణంగా కృష్ణజింక మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది జింక కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. అటవీ ప్రాంతాల్లో సంచరించే వన్యప్రాణులపై కుక్కల దాడులు పెరుగుతున్నాయని, వాటి సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరారు.
బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సభ్యులు, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ నరేందర్ రెడ్డి ఆదివారం బాన్సువాడ ఎంసీహెచ్‌ను సందర్శించారు. ఇటీవల బాన్సువాడ ఎంసీహెచ్‌లో ఆపరేషన్ చేసుకు న్న ఐదుగురు బాలింతలను హైదరాబాద్‌లోని నిమ్స్ కు తరలించిన విషయం తెలిసిందే. బాలింతలకు అలా కావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. కమిటీ సభ్యులు బాన్సువాడ ఎంసీహెచ్‌లోని ఆపరేషన్ గదిని పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని అన్నారు. వారి వెంట సూపరింటెండెంట్ భాస్కర్ ఉన్నారు.


